అచ్చంపేట, జనవరి 1: లక్కీ స్కీమ్ పేరుతో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఏర్పాటుచేసిన డ్రా గందరగోళానికి దారితీసింది. డ్రాలో వచ్చిన పేర్లు బోగస్ అంటూ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. నిర్వాహకులు అక్కడి నుంచి జారుకోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అచ్చంపేటకు చెందిన కొందరు శ్రీలక్ష్మీనర్సింహ స్వామి ఎంటర్ప్రైజెస్ పేరుతో లక్కీ స్కీమ్ ఏర్పాటు చేశారు. ఏజెంట్లను నియమించారు. ఒక్కో సభ్యుడి నుంచి రూ.300 చొప్పున కూపన్లు కొనుగోలు చేయించారు. మొదటి ప్రైజ్ కింద రూ.10 లక్షల నగదు, రెండు నుంచి ఐదో బహుమతి వరకు పలు రకాల కార్లు, ఏడో బహుమతి కింద ట్రాక్టర్, 8వ బహుమతిగా బుల్లెట్, తొమ్మిది బైక్, పలువురికి కూలర్లు, ఇతర వస్తువులు, 14వ ప్రైజ్ కింద అర తులం బంగారం ఇలా ఇరవైకి పైగా ప్రైజులు ఇస్తామని కరప్రతంలో పేర్కొన్నారు. స్కీమ్ ఆకట్టుకునేలా ఉండటంతో 40 వేల మంది అందులో చేరారు. శనివారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్హాల్లో డ్రా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏజెంట్లు, సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. డ్రా తీసిన నంబర్లలో అక్కడికి వచ్చిన వారిలో ఎవరి పేర్లూ లేకపోవడంతో అనుమానంతో నిర్వాహకులను నిలదీశారు. నిర్వాహకులు నకిలీ రసీదులు తయారు చేసినట్టు గుర్తించారు. సభ్యుడి పేరు, ఫోన్ నంబర్, చిరునామా లేకుండా ఇష్టానుసారంగా రాసుకొని మోసం చేశారంటూ సభ్యులు మండిపడ్డారు. దీంతో నిర్వాహకులు అక్కడి నుంచి జారుకున్నారు. బాధితులు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కల్వకుర్తి, వెల్దండ, అమ్రాబాద్, అచ్చంపేట తదితర ప్రాంతాలకు చెందిన బాధితులు పోలీస్ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తామని ఎస్సై ప్రదీప్ తెలిపారు.