పాల్వంచ, ఆగస్టు 17: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసం చేసిన దంపతులకు మంగళవారం దేహశుద్ధి చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకున్నది. పాల్వంచకు చెందిన మేఘన సరస్వతి తన భర్త రాంబాబుతో కలిసి 2019లో కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. బాధితులు అశ్వారావుపేటకు చెందిన కేశవులుతోపాటు 91మంది వద్ద మొత్తం రూ.1.90 కోట్లు వసూలు చేసినట్టు తేలింది. ఉద్యోగం రాకపోవడంతో ఆగ్రహించిన బాధితులు మంగళవారం భార్యాభర్తలను పట్టుకుని వారి ఇంట్లోనే దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో సరస్వతికి ఫిట్స్ రావడంతో పోలీసులు ఆమెను పాల్వంచ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.