హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోనే తమ సంస్థ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ (హాన్-హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్) గ్రూప్ చైర్మన్ యంగ్ లియూ స్పష్టంచేశారు. వీలైనంత తొందరలోనే రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి దిశగా పురోగమించడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి, కనబరుస్తున్న దార్శనికతలనుంచి తాను స్ఫూర్తి పొందినట్టు యంగ్ లియూ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు.
ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ స్వయంగా లేఖ రాసి విడుదల చేయడంతో.. తెలంగాణలో పరిశ్రమను ఏర్పాటు చేయాలా, వద్దా అనే సందిగ్ధంలో సంస్థ ఉన్నదంటూ కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారానికి తెర పడినట్టయ్యింది. ఈ నెల రెండవ తేదీన ఫాక్స్‌కాన్ చైర్మన్ నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధిబృందం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమై తెలంగాణలో కంపెనీ ఏర్పాటుపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ సీఎంకు రాసిన లేఖ తెలంగాణలో వారి సంస్థ పెట్టుబడులు పెట్టడంపై నిబద్ధతను స్పష్టంచేసిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది. త్వరలోనే తాము కొంగరకలాన్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామని సంస్థ చైర్మన్ స్పష్టంచేశారు. మార్చి 2న సీఎం కేసీఆర్‌తో జరిగిన చర్చలను యంగ్ లియూ తన లేఖలో ప్రస్తావించారు.

హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా తనకు, తన బృందానికి లభించిన ఆతిథ్యానికిగాను సీఎం కేసీఆర్‌కు ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆతిథ్యం తనను ఎంతో ఆకట్టుకున్నదని, హైదరాబాద్‌లో బస చేసిన సమయంలో అద్భుతమైన సమయాన్ని గడిపానని లేఖలో పేర్కొన్నారు. తన పుట్టినరోజున స్వదస్తూరితో కేసీఆర్ గ్రీటింగ్ కార్డు ఇవ్వడం వ్యక్తిగతంగా తనకు అమితానందాన్ని కలిగించిందని పేర్కొం టూ.. అందుకుగాను సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణ అభివృద్ధి దిశగా పురోగమించడానికి మీరు చేస్తున్న కృషి, కనబరుస్తున్న దార్శనికతలనుంచి నేను స్ఫూర్తి పొందాను’ అని ఒక అంతర్జాతీయ ప్రముఖ సంస్థ చైర్మన్ స్వయంగా ప్రకటించడం రాష్ర్టానికి గర్వకారణంగా నిలుస్తున్నది. అంతేకాకుండా ఆయన కేసీఆర్‌ను భారత్ నుంచి తనకు లభించిన ఆత్మీయుడిగా భావించడం మరో విశేషం. తన సంస్థ వ్యాపార విస్తరణకు తెలంగాణ సరైన గమ్యస్థానమని ఆయన భావిస్తున్నారు.
‘నాకు ఇప్పుడు భారతదేశంలో కొత్త స్నేహితుడు ఉన్నారు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’ అని సీఎంకు రాసిన లేఖలో యంగ్ లియూ పేర్కొన్నారు. తైపీ లో కేసీఆర్‌కు ఆతిథ్యం ఇవ్వడం తన గౌరవమని, తైవాన్‌కు రావాలని సీఎంకు ఆహ్వానం పంపారు. త్వరలో కేసీఆర్‌ను కలవాలని ఎదురుచూస్తున్నట్టు పేర్కొంటూ లేఖను ముగించారు యంగ్ లియూ. సీఎం కేసీఆర్ కృషి, దార్శనికతకు లియూ ప్రేరణ పొందినట్టు లేఖ ద్వారా స్పష్టమవుతున్నది.