హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఫాక్స్‌కాన్ సంస్థ తొలిదశ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఆ కంపెనీ విస్తరణ ప్రణాళికలు ఎంతవరకు వచ్చాయో తెలియవని పేర్కొన్నారు. 1.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదటి దశ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిందని, ఇందులో దాదాపు 20 వేల మందికి పైగా ఉపాధి దొరుకుతుందని వివరించారు. బుధవారం సోషల్ మీడియాలో ముత్తుకృష్ణన్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఫాక్స్‌కాన్ సంస్థ రెండో దశలో 6.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో $582 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్నదని తనకు తెలిసిందని చెప్పారు. రెండో దశ తర్వాత సంస్థలో మొత్తం 80 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అదనంగా 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశం కూడా ఉన్నదని, కానీ అక్కడ ఏం జరుగుతున్నదో తనకు పూర్తి సమాచారం తెలిదని కేటీఆర్ పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్‌కు సంబంధించి 2023లో కేసీఆర్ నాయకత్వంలో అవగాహన ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు.