హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నలుగురు సిట్టింగ్ ఎంపీలే తిరిగి ఎన్నికయ్యారు. ఆ నలుగురిలో ముగ్గురూ బీజేపీ నుంచే గెలుపొందారు. బీజేపీ అభ్యర్థులుగా సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ గెలుపొందారు. హైదరాబాద్ నుంచి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఎం పీగా తిరిగి విజయం సాధించారు.
బీఆర్ఎస్కు చెందిన రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్ ఆ పార్టీని వదిలి కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లి పోటీచేసినా ఓటమిపాలయ్యారు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గోడెం నగేశ్, సురేశ్ షెట్కార్, బలరాం నాయక్, మల్లు రవి తిరిగి ఎంపీలు గా ఎన్నికయ్యారు. గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యేగా పనిచేసిన రఘనందన్‌రావు లోక్‌సభకు ఎన్నికయ్యారు. చట్టసభలకు కొత్తగా ఎన్నికైనవారిలో యువ నేతలు ఉన్నారు.
వరంగల్ నుంచి కడియం కావ్య, నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ ఈ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది ఢిల్లీ బాటపట్టారు. రాజకీయ కుటుంబానికి చెందిన రామసహాయం రఘరామిరెడ్డి మొదటిసారిగా చట్టసభకు ఎన్నికయ్యారు.