CM Revanth Reddy | మహబూబ్‌నగర్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): నేను రాష్ట్రంలో నలుమూలను తిరిగినా మీకు అండగా తిరుపతిరెడ్డి ఉంటాడు, మీకు ఏ కష్టం వచ్చినా.. ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు అని చంద్రవంచ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. ఆదివారం నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రవంచ గ్రామంలో రైతుభరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఎట్టకేలకు తన షాడో సీఎంగా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు తన సోదరుడు తిరుపతిరెడ్డి అందుబాటులో ఉంటాడని ప్రజాపాలన సాక్షిగా వెల్లడించారు. రామారావు అంటున్నాడు.. ఆయనకు ఏం పదవి ఉందని, నేను అడుగుతున్న మీ కుటుంబంలో అందరికీ పదవులున్నాయి.
మాకు ఏ పదవీ లేకుండా ప్రజలకు సేవ చేసేందుకు, ఆదుకునేందుకు ముందుకు వస్తాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా తిరుపతిరెడ్డి మీకు ఉంటాడు అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే ఈ నియోజకవర్గానికి అండగా తమ కుటుంబసభ్యులు ఉంటారని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని భూములు సేకరించడానికి వెళితే కొంతమంది కావాలని అధికారులపై దాడులకు ఉసిగొలిపి చంపడానికి ప్రయత్నించారని విమర్శించారు. నియోజకవర్గంలోని యువతకు ఉపాధి కల్పించవద్దా? పరిశ్రమలు తేవద్దా? అంటూ రేవంత్ ప్రశ్నించారు. వెనుకబడ్డ కొడంగల్ నియోజకవర్గానికి ఏదో చేద్దామని ప్రయత్నిస్తే కొందరు కావాలని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
బోనస్ ఇచ్చి ఆదుకున్నా
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినా దేశం మొత్తం మీద కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి రూ.500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్నామని రేవంత్ చెప్పారు. పదేైండ్లెనా పాలమూరు ఎత్తిపోతల, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి కాలేదని చెప్పుకొచ్చారు. రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంటే కొందరు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని విమర్శించారు.
జనం లేక రేవంత్ తడబాటు
నారాయణపేట జిల్లా చంద్రవంచలో ప్రారంభించిన నాలుగు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ గ్రామసభకు కొడంగల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనం వస్తారని ఆశించి ఏర్పాట్లు చేశారు. వేసిన టెంటు కింద కూడా జనం లేకపోవడంతో రేవంత్ స్పీచ్ వెలవెలబోయింది. సవాళ్లు ప్రతీ సవాళ్లు లేకుండానే సప్పగా సాగింది. ప్రతీసారి ఆయన జనం వైపు చూడడం అక్కడ కుర్చీలన్నీ ఖాళీగా ఉండడంతో ఏం మాట్లాడాలో తెలియక కేవలం పథకాల గురించి ప్రస్తావించారు. కొడంగల్ నియోజకవర్గంలో అంతా తన సోదరుడు తిరుపతిరెడ్డి చూసుకుంటాడని చెప్పడానికే వచ్చినట్టు సభ సాగింది.
జిల్లా కలెక్టర్‌కు రెండో వరుసలో సీటు
చంద్రవంచ సభలో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రెండో వరుసలో సీటు కేటాయించారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి మాత్రం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి పక్కన సీటు కేటాయించడం విమర్శలకు తావిచ్చింది. సీఎం రాగానే నివేదికను కలెక్టర్ వెనుక నుంచి ఇచ్చారు. ముందు వరుస అంత కాంగ్రెస్ నాయకులు కూర్చోవడంతో చివరకు కలెక్టర్ వెనుక వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర నిరాశకు గురయ్యారు.