న్యూస్‌నెట్‌వర్క్, సెప్టెంబర్ 24: తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. పలు చోట్ల పిడుగులు పడి నలుగురు మృత్యువాత పడగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో పిడుగుపడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం శివారు బూరుగుగుంపునకు చెందిన కూలీలు కట్టం నాగశ్రీ (22), సున్నం అనూష (23) మృతిచెందారు. జగ్గారం గ్రామానికి చెందిన మడివి సీతమ్మ, ఊకే రత్తమ్మ, కల్లూరి రాతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం దవాఖానకు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బత్తులపల్లికి చెందిన దుర్గం లక్ష్మయ్య (65) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లిలో పిడుగుపడి ఎర్రబొజ్జు రాధిక ఇల్లు ధ్వంసమైది. సింగూరు ప్రాజెక్టు నుంచి వరద వస్తుండటంతో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వరంగల్, నాగర్‌కర్నూల్, నిర్మల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, జోగులాంబ-గద్వాల, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలుకురిశాయి. ఖిల్లా-వరంగల్ మండలంలో 9.67 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది.