Heat Wave | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో అల్పపీడనంతో గతవారం వాతావరణం కాస్త చల్లగా ఉన్నా సోమవారం నుంచి ఎండ తీవ్రత మొదలైంది. సూర్యుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమిగా మారాయి. 10 జిల్లాల్లో 44 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా కుభీర్‌లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మరో 23 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి మంగళవారం నలుగురు మృతి చెందారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన మేడి ఎర్రముత్తయ్య(76) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. పెనుబల్లి మండలం కందిమళ్లవారి బంజర్‌కు చెందిన వంటలమేస్త్రి తుమ్మలపల్లి సత్యనారాయణ(43) వంట చేసేందుకు వెళ్లి వడదెబ్బ బారిన పడి మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మర్రిపెల్లి అర్వింద్ (19) మామిడి తోటకు నీరు పెట్టేందుకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు.
చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్లకు చెందిన పాత భూమయ్య(58) సైకిల్‌పై తిరుగుతూ చింతగింజలు, చింతపండు, ధాన్యం కొనుగోలుతో జీవనం సాగించేవాడు. మంగళవారం సైకిల్‌పై వెళుతూ వడదెబ్బ తగిలి పడిపోయాడు. దవాఖానకు తరలించేలోపే చనిపోయాడని స్థానికులు చెప్పారు.
రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది. వడగాలుల నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. అస్వస్థతకు గురైతే వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవాలని తెలిపారు. తరచుగా నీరు, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు తాగడం వల్ల ఒంట్లో నీరు, లవణాలు తగ్గకుండా, నీరసం, అస్వస్థతకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.