హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తు న్న గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. వీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రెండేళ్లపాటు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. ఆ తర్వాత పూర్తిస్థాయి న్యాయమూర్తులుగా పదోన్నతి లభిస్తుంది. ఈ నలుగురితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రమాణం చేయించనున్నారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్తో కలిపి హైకోర్టులో మొత్తం 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కొత్త వారు ప్రమాణ స్వీకారం చేశాక ఆ సంఖ్య 30కి పెరుగుతుంది. అనంతరం మరో 12 పోస్టులు ఖాళీగా ఉంటాయి.