గజ్వేల్, జూలై 14: ప్రభుత్వం పంతాలు, పట్టింపులు, భేషజాలకు పోకుండా నాలుగు మోటర్లను ప్రారంభించి కాళేశ్వరం నుంచి ప్రాజెక్టులు, రిజర్వాయర్లను నింపి రైతాంగానికి అండగా నిలవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. ఆదివారం సిద్దిపేట, గజ్వేల్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పదోతరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన 75 మంది విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ఒకొకరికి పదివేల రూపాయల విలువైన ఐ ప్యాడ్లను సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
గజ్వేల్‌లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం గజ్వేల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అన్నారు. మేడిగడ్డ వద్ద ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నదని తెలిపారు. బరాజ్ గేట్లు తెరిచి నదిలో ఉన్న నీటి ప్రవాహానికి అనుగుణంగా నాలుగు మోటర్లను నడిపించే అవకాశం ఉన్నదని సూచించారు.
కరువు పరిస్థితిలో కాళేశ్వరం నీటిని తీసుకొచ్చి చెరువులు, కుంటలు నింపితే రైతాంగానికి పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం మోటర్లను ప్రారంభించి కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలను నింపి వాటి ద్వారా చెరువులను నింపితే రైతులు పంటలు పండించుకుంటారని తెలిపారు.
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగు, సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే ప్రభుత్వం మోటర్లను ప్రారంభించి నీటిని నింపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయని, రైతులంతా వర్షాల కోసం కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నారని తెలిపారు.
సాగునీటితోపాటు ఎరువులు, విత్తనాలకు రైతులు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.