హైదరాబాద్ సిటీబ్యూరో/నాంపల్లి కోర్టు, మే 9 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో సిట్ మరో నలుగురిని మంగళవారం అరెస్ట్ చేసింది. వీళ్లు ప్రధాన నిందితుడు ప్రవీణ్ వద్ద ఏఈ, ఏఈఈ పరీక్ష పత్రాలను కొన్న ఇద్దరు దళారుల నుంచి ప్రశ్నపత్రాన్ని కొన్నారు. దళారులు మనోజ్‌కుమార్‌రెడ్డి (వరంగల్), మురళీధర్‌రెడ్డి (హైదరాబాద్)ని సిట్ సోమవారమే అరెస్టు చేసింది. వీరిద్దరు ప్రశ్నపత్రాలను రూ.10 లక్షల చొప్పున మొత్తం ఏడుగురికి అమ్మినట్టు విచారణలో తెలిపారు. అడ్వాన్స్‌గా రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర తీసుకున్నట్టు వెల్లడించారు. వీరిచ్చిన సమాచారంతోనే ఆది సాయిబాబు (నాగర్‌కర్నూల్), ముడావత్ శివకుమార్ (నాగర్‌కర్నూల్), రమావత్ మహేశ్ (నాగార్జునసాగర్), పొన్నం వరుణ్ (ఖమ్మం)ను సిట్ అరెస్ట్ చేసింది. కోర్టు అనుమతితో వీరి నుంచి మరిం త సమాచారాన్ని సేకరించనున్నది. ఈ కేసులో నిందితుల సంఖ్య 28కి చేరగా 27 మందిని అరెస్ట్ చేసింది. సోమవారం అరస్టైన ఇద్దరు దళారులకు కోర్టు రిమాండ్ విధించింది.