కొత్తగూడెం ప్రగతి మైదాన్ : భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన ఘటన ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లాలో జరిగింది. ఖవాండే-నెల్గుండ ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా మావోయిస్టులు ఎదురుపడి వారిపై కాల్పులు జరిపారు.
కాల్పుల వేగం పెంచుతూనే ఆ ప్రాంతాన్ని జవాన్లు చుట్టుముట్టారు. మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయాక ఘటనా స్థలిలో మృతి చెందిన నలుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు కొన్ని ఆయుధాలు, విప్లవ సాహిత్యం వంటి ఇతరత్రా వస్తువులను జవాన్లు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు.