Kondareddy Pally | కల్వకుర్తి, ఏప్రిల్ 28: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంతూరుకు వేస్తున్న నాలుగులేన్ల రోడ్డు రైతులకు కన్నీరుతెచ్చి పెడుతున్నది. భూసేకరణ చేయకుండా, రైతులను ఒప్పించకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా మొదలు పెట్టిన రహదారి పనులతో కర్షకులు ఆగమవుతున్నారు. రోడ్డు వెడల్పు పనులతో రైతులు తమ పొలాలకు వేసుకున్న కంచెలు మునిగిపోతున్నాయి. హద్దులు చెరిగిపోతున్నాయి. నీటి పైప్లైన్లు, చెట్లు, గట్లు కోల్పోయిన బాధలో ఇదెక్కడి అన్యాయమని అడగాలంటే అధికా రం కన్నెర్ర చేస్తుందని భయపడుతున్నారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తామని గప్పాలు కొట్టిన చిల్లర దేవుళ్లు ఇప్పుడు ఫోన్‌కూడా లిఫ్ట్ చేయడం లేదట. పనులకు అడ్డం పడేంత శక్తిలేకపోవడంతో రైతులు దీనంగా చూస్తున్నారు.
6 కిలోమీటర్ల మేర రోడ్డు
నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి 2015 వరకు పీఆర్ రోడ్డు ఉండేది. 2016-17లో ఆర్అండ్బీ రోడ్డుగా మారుస్తూ డిండిచింతపల్లి వరకు సింగిల్ లేన్ రోడ్డు నుంచి డబుల్ రోడ్డుగా మార్చారు. రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో కొండారెడ్డిపల్లి వరకు 6 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డు వేయాలని నిర్ణయించారు. జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై కొండారెడ్డిపల్లి గేట్ నుంచి కొండారెడ్డిపల్లి గ్రామం వరకు రోడ్డు విస్తరించి నాలుగు లైన్ల రోడ్డు చేపట్టాలని హడావుడిగా నిర్ణయించి పనులు ప్రారంభించారు.
ప్రాథమిక అంచనా రూ.17 కోట్లు
కొండారెడ్డిపల్లి గేట్ నుంచి కొండారెడ్డిపల్లి గ్రామం వరకు 6 కిలోమీటర్ల మేర నాలుగులేన్ల రోడ్డుకు రూ.17 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇందులో రాష్ట్ర వాటా 25 శాతమైతే కేంద్రం వాటా 75 శాతం. ఇందులో ప్రధానమైన ట్విస్ట్ ఏమంటే.. రోడ్డు వెడల్పునకు అవసరమయ్యే భూమి సేకరించి, సంబంధిత డాక్యుమెంట్లు కేంద్ర ప్రభుత్వానికి అందిస్తే రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. రోడ్డు వెడల్పు పనులకు ఇప్పటివరకు భూసేకరణ చేయలేదని రైతులు అంటున్నా రు. ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదని, పో యిన భూమికి డబ్బు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రోడ్డు విస్తర ణకు హద్దు రాళ్లు పాతినట్టు తెలిపారు.
66 అడుగుల రోడ్డు నిర్మాణం
6 కిలోమీటర్ల మేర 66 అడుగుల వెడల్పు (2105 మీటర్లు)తో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు ఒక్కో చోట నాలుగు నుంచి ఆరేడు మీటర్ల ఎత్తు పైకిలేచింది. రోడ్డును పైకి లేపి మట్టిని పోయడంతో చాలామంది రైతుల తోటలు, ఫెన్సింగ్‌లు, పైప్లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, హద్దులు మునిగిపోయాయి. నష్టపరిహారం కూడా ఇవ్వలేదని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొండారెడ్డిపల్లి గేట్ వద్ద ఎకరం దాదాపు రూ.2కోట్ల వరకు పలుకుతున్నది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, భూసేకరణ చేయకుండా రోడ్డు నిర్మిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
నా ఫెన్సింగ్ మునిగిపోయింది
కొండారెడ్డిపల్లి గేటు సమీపంలో నాకు ఏడెకరాలు ఉన్నది. నాలుగు లేన్ల రోడ్డులో దాదాపు 10గుంటల పొలం పోయింది. రోడ్డు కోసం హద్దు రాయి పాతి మార్క్ వేశారు. నా పొలం వద్ద రోడ్డు దాదాపు 8 మీటర్లపైకి లేచింది. రోడ్డు మీద పోసిన మట్టిలో నా పొలం ఫెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్ మునిగిపోయింది. ఇదేమిటని అడిగితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు.
– కే దశరథ్‌రెడ్డి, తాండ్ర గ్రామం, నాగర్‌కర్నూల్ జిల్లా
ఇంతపెద్ద రోడ్డు ఎందుకు?
వ్యవసాయం చేసుకుని బతికేటోళ్లం. ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు. రెక్కాడితేనే డొక్కాడుతుంది. ఉన్నదే రెండెకరాల పొలం. అందులో నుంచి రోడ్డు పోయింది. పొలం కన్నా ఏడెనిమిది మీటర్ల ఎత్తున రోడ్డు ఉంది. పొలంలోకి పోయేందుకు దారి లేకుం డా పోయింది. ఎవర్ని అడిగినా పట్టించుకోవడం లేదు. భూమి పోయినందుకు డబ్బులు వస్తాయని మా ఊరి పెద్ద మనిషి చెప్పాడు. ఇప్పుడేమో రావంటున్నారు. మాలాంటి పేదల పొట్టలు కొట్టి ఎవరేం బాగుపడుతారు. రోడ్డులో పోయిన భూమికి డబ్బులు ఇవ్వాలి. పొలంలోకి వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలి. అయినా ఎవరు అడిగారని ఇంత పెద్ద రోడ్డు వేస్తున్నారు.
– పరశురాములు, రైతు, తాండ్ర గ్రామం, నాగర్‌కర్నూల్ జిల్లా