అచ్చంపేట రూరల్/లింగాల/జగిత్యాల రూరల్, ఏప్రిల్ 3 : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై నలుగురు రైతులు మరణించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు, జగిత్యాల జిల్లాలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట మండలం చెదురుబావితండాకు చెందిన కాట్రావత్ లోక్య(30), మూడావత్ కుమార్(28) బావబామ్మర్దులు. బుధవారం సాయంత్రం తండా సమీపంలోని పొలంలో ఉన్న ఆవులకు నీళ్లు తాపేందుకు వెళ్లగా బోరు మోటర్ పనిచేయలేదు. ఇద్దరు కలిసి బావిలోకి దిగి మోటర్‌కు ఉన్న విద్యుత్తు వైర్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. కాగా లింగాల మం డలం సూరాపూర్ గ్రామానికి చెందిన రైతు దేశ పర్వతాలు (42) మగ్దూంపూర్ గ్రామ శివారులో బిచ్చి రాములుకు చెందిన మూడెకరాలు కౌలుకు తీసుకొని మక్కజొన్న సాగు చేశాడు. గురువారం తెల్లవారుజామున పంటకు నీళ్లు పెట్టడానికి మోటర్ స్టార్టర్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్ల గా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. పర్వతాలు ఇంటి కి రాకపోవడంతో కుమారు డు పొలం వద్దకు వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నాడు. జగిత్యాల మండలం పొరండ్లకు చెందిన దేవి చంద్రయ్య(59) గ్రామ శివారులోని తన పొలం వద్దకు గురువారం నడుచుకుంటూ వెళ్తుండగా అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్తు తీగలు కాళ్లకు తగిలి షాక్‌తో మృతి చెందాడు.