ఒకవైపు సాగు సాగక, మరోవైపు సర్కారు భరోసా కానరాక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. 24గంటల్లో నలుగురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కొత్తగూడెం, వరంగల్, జనగామ జిల్లాల్లో నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు.
Telangana | నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, జూలై 7 : కాలం కలిసి రాక.. అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 24 గంటల్లోనే రాష్ట్రంలో నలుగురు రైతులు బలవన్మరణం చెందారు. వీరిలో ఒకరు భూసమస్య పరిష్కారం కావడం లేదనే మనస్తాపంతో ప్రాణాలు విడిచారు. ఆత్మహత్యకు యత్నించిన మరో ఇద్దరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగామ, ములుగు జిల్లాల్లో జరిగిన ఘటనల వివరాలు ఇలా..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బెటితండా చెందిన బానోత్ రాంధాన్, కమలమ్మ దంపతులు 9 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశారు. రెండుసార్లు పత్తి గింజలు వేసినా మొలకెత్తలేదు. దీంతో రాంధాన్, కమలమ్మ (35) తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భూమి దున్నడం, విత్తనాలు విత్తుకోవడానికి అప్పులు తెచ్చారు. విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడంతో అప్పులు మీదపడగా, మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారింది. వీరి ఇద్దరు కుమారులు డిగ్రీ చదువుతున్నారు. వారి చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని మనోవేదనకు గురైన కమలమ్మ శనివారం పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆ కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పరామర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి జానకీపురంనకు చెందిన రైతు పిట్టల లక్ష్మయ్య(40) 3 ఎకరాలతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వరి, పత్తి, మిర్చి పండిస్తున్నాడు. పెట్టుబడికి కొంత అప్పు చేశాడు. పంటలు పండక దిగుబడి రాకపోవడంతో అప్పులు అధికమయ్యాయి. దానికితోడు తండ్రి వైద్యానికి , పిల్లల చదువుల కోసం మరికొంత అప్పులు చేయగా తడిసిమోపెడయ్యాయి. నెల రోజుల క్రితం తండ్రి మృతిచెందాడు. అప్పులు తీర్చే మార్గం లేక గ్రామ శివారులోని తన పొలం వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు పెనుబల్లి వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదివారం లక్ష్మయ్య ఇంటికి వెళ్లి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని ఏళ్లుగా రెవెన్యూ అధికారులు, పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్నది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం కొండాపూర్‌కు చెందిన పసునూరి నరేందర్‌రెడ్డి, అతడి తండ్రి లక్ష్మీనారాయణరెడ్డికి చెందిన రెండు ఎకరాల భూమిని మామ, అల్లుడు శివరాత్రి చిన్న బుచ్చయ్య, కుంచం కార్యవర్ది రాజు కలిసి చెరో ఎకరాన్ని 2011లో కొనుగోలు చేసి డబ్బులు చెల్లించారు. రూ.20 వేలు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లిస్తామని పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన దేవేందర్ వీరికి మధ్యవర్తిగా ఉన్నాడు. 2011లో కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని నరేందర్‌రెడ్డిని కోరగా, భూమి తన తండ్రి పేరిట ఉన్నదని, చనిపోయిన తన తండ్రి పేరు నుంచి తన పేరు మీదికి రెండేళ్ల తర్వాత మారుతుందని, అప్పుడు రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మబలికాడు.
2014లో తన పేరు పైకి రాగానే భూముల ధరలు పెరగడంతో అధిక డబ్బులకు ఆశపడి గోవిందరావుపేట, బుసాపూర్కు చెందిన గుండ్రెడ్డి వినోదకు అదే భూమిని అమ్మి రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో మొదట కొనుగోలు చేసిన శివరాత్రి చిన్న బుచ్చయ్య, కుంచం కార్యవర్ది రాజు మోసపోయామని గుర్తించి నరేందర్‌రెడ్డి, దేవేందర్‌ను నిలదీశారు. తమకు అమ్మినచోట కాకుండా వేరే చోట భూమి ఇస్తామని దేవేందర్‌రెడ్డి చెప్పగా, ఒప్పందం ప్రకారంమే తమకు భూమి ఇవ్వాలని శివరాత్రి చిన్న బుచ్చయ్య, కుంచం కార్యవర్ది రాజు కోరారు.
ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని అప్పటి ఆర్డీవో ఎల్ రమేశ్‌ను ఆశ్రయించగా, వినోదకు పట్టాపాస్ బుక్ రాకుండా డిజిటల్ సిగ్నిచర్ను పెండింగ్‌లో పెట్టారు. శనివారం శివరాత్రి చిన్న రాజయ్య, అతడి భార్యతోపాటు కార్యవర్ది రాజు భార్య కుంచం వెంకటలక్ష్మి (35) మధ్యవర్తి దేవేందర్‌తో మాట్లాడారు. తమకు భూమి దక్కదని మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి ఆదివారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం అనంతరం మధ్యవర్తి ఇంటి ఎదుట మృతదేహంతో బంధువులు, కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు.
భూ సమస్య పరిష్కారం కావడం లేదని ములుగు జిల్లాలో ఓ మహిళా రైతు ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన వాంకుడోత్ రాజమ్మ 2018లో అన్నంపల్లి శివారులో సర్వే నంబర్ 153లో 36 గుంటల భూమిని కంది వెలగొండారెడ్డి వద్ద కొనుగోలు చేసింది. ఆ భూమి ధరణి పోర్టల్‌లో సానికొమ్ము అంజిరెడ్డి పేరిట ఉన్నది. ఈ విషయమై స్థానిక పెద్దమనుషులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇరువురి అంగీకారంతో ప్రభుత్వ సర్వేయర్ ద్వారా ఈ నెల 4న కొలతలు వేయించగా, భూమి 153 సర్వే నంబర్దని తేలింది. సంబంధిత భూమిని అంజిరెడ్డి గ్రామ పెద్దల సమక్షంలో రాజమ్మ పేరు మీదకు మార్చుతానని అంగీకరించి మాట మార్చాడు. మనస్తాపానికి గురైన రాజమ్మ పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతున్నది.
అప్పుల బాధతో రైతు దంపతులు ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడగా భర్త మృతి చెందగా, భార్య చికిత్స పొందుతున్నది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం సోమయ్యకుంటతండాకు చెందిన కెతావత్ సంతోష్ (36), సరోజ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వీరికున్న నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేస్తున్నారు. దీనికితోడు వరికోత యంత్రం, కారు, ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వరికోత యంత్రం, కారు, ఆటోకు సరిగ్గా కిరాయిలు దొరకక, వ్యవసాయం చేసినా ఆశించిన మేర దిగుబడి రాక అప్పులయ్యాయి. ఈ వానకాలంలో వరి వేసేందుకు దుక్కి సిద్ధం చేయడంతోపాటు నారు కూడా పోశారు. అదనుకు వానలు పడకపోవడంతో తమకున్న బోరు ద్వారా నీళ్లు పారిస్తున్నా అవి సరిపోవడం లేదు. ఆదివారం మరో బోరు వేస్తానని భార్య సరోజతో చెప్పడంతో మరింత అప్పు అవుతుందని ఆమె నిరాకరించింది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన సరోజ భర్తను బెదిరించేందుకు కొద్దిగా పురుగుల మందుతాగింది. గమనించిన స్థానికులు, భర్త సంతోష్ జనగామ ఏరియా వైద్యశాలకు తరలించారు. సరోజ పరిస్థితి విషమంగా ఉన్నదని భావించిన సంతోష్ స్వగ్రామానికి వచ్చి, వ్యవసాయ బావి వద్ద పురుగు మందుతాగి, బెంగళూరులో ఉన్న తన తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాడు. అతను వెంటనే గ్రామస్థులను అప్రమత్తం చేయడంతో వారు సంతోష్‌ను జనగామ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.