హైదరాబాద్, జూన్ 24 (నమస్తేతెలంగాణ): ఈ నెల ఆఖరివారంపై అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకూ సరైన వానలు లేక ఆందోళనలో ఉన్న రైతులకు అందిన ఓ శుభవార్త వారిలో ఆశలను రేకెత్తిస్తున్నది. జూన్ నెల చివరి వారం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయని మంగళవారం కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే వారం రోజులైనా ఆశాజనకంగా వర్షాలు కురుస్తాయని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
వానాకాలం సీజన్ ప్రారంభమై 24 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పెద్దగా వర్షాలు పడలేదు. దీంతో పంటలు వేసేందుకు రైతులు ఆలోచిస్తున్నారు. 10 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని.. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో పంటల సాగు ముందే మొదలవుతుందని అన్నదాతలు ఆశపడ్డారు. కానీ సీజన్ ప్రారంభమైన తర్వాత నిరాశే మిగిలింది.
రుతుపవనాలు బలహీనపడటంతో వాటి కదలిక స్తభించిపోయింది. దీంతో 15 రోజుల పాటు నైరుతి రుతుపవనాల కదలిక నిలిచిపోయింది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా తొలకరి వానలకు విత్తనాలు చల్లిన రైతులు.. ఇప్పుడు వానలు ముఖం చాటేయడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఈ సీజన్లో కుంభవృష్టి లేదా కరువు తప్పదేమోననే ఆందోళన చెందుతున్నారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ నుంచి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పశ్చిమ, నైరుతి దిక్కుల నుంచి కిందిస్థాయిలో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 4 రోజులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది.
మంగళవారం రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది. కుమ్రంభీం జిల్లా బెజ్జూర్ మండలంలో 6.13 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది.