హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆదివారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఏపీకి మిచాంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉందని, కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఏపీకి మిచాంగ్ తుపాన్ ముప్పు
ఏపీకి మిచాంగ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది. కోస్తాంధ్ర వైపుకు తుఫాన్ దూసుకొస్తున్నది. దీంతో కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాయలసీమలోనూ తుపాను ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారుల సూచనలతో రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. మిచాంగ్ తుఫాన్ కారణంగా నేటి నుంచి నాలుగైదు రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఈ నెల 5వ తేదీన నెల్లూరు-మచిలిపట్నం వద్ద మిచాంగ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నది.
ఆది, సోమవారాల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను నేపథ్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ ఎండీ బీఆర్ అంబేదర్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.