KTR | నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలు కేసీఆర్ కుటుంబమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భూపాలపల్లి అంబేద్కర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కొందరు కేసీఆర్‌ది కుటుంబ పాలన అని కొందరు మూర్ఖులు అంటున్నరు. మాది కుటుంబ పాలనే అని మొన్న అసెంబ్లీలో చెప్పిన. తెలంగాణలోని నాలుగుకోట్ల మంది కేసీఆర్ కుటుంబమే. తొమ్మిదేళ్ల పరిపాలనలో 65లక్షల మంది రైతులకు 65వేలకోట్ల రైతుబంధు ఖాతాల్లో వేసిన కేసీఆర్ పెద్దన్న కాదా? నెలకు 44లక్షల మంది పెద్ద మనుషులు, వితంతువు, దివ్యాంగులు, నేతన్నలు, గీతన్నలకు పెన్షన్ ఖాతాల్లో వేస్తున్న మీ కుటుంబ సభ్యుడు కేసీఆర్ కాదా?.
ఇవాళ ఇంటి ముందు నల్లా తిరుగుతుందంటే.. ఆ నల్లా నుంచి నీళ్లు వస్తున్నయంటే.. నీళ్ల బాధ మా ఆడబిడ్డలకు తప్పించింది పెద్ద కేసీఆర్ మీ కుటుంబ సభ్యుడు కాదా? 12లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.8వేలకోట్లు ఖర్చు చేసి లగ్గం చేసిన మేనమామ కేసీఆర్ కాదా? 14లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి చేయించి.. మాతా శిశు మరణాలు తగ్గించి.. ఈ రోజు 30శాతం నుంచి 60శాతం డెలివరీలు గవర్నమెంట్ ఆసుప్రతుల్లో జరుగుతున్నాయంటే.. నేను రానుబిడ్డో సర్కారు దవాఖాన నుంచి.. నేను సర్కారు దవాఖానకే పోతా.. అక్కడ మా మేనమామ కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్ ఇస్తడు అనే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ కుటుంబ సభ్యుడు కాదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘ప్రభుత్వ నియామకాల్లో 95శాతం రిజర్వేషన్లను భారతదేశంలో ఎక్కడా లేవు. రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 2.21లక్షల ఉద్యోగాలు ప్రభుత్వరంగంలో ఇస్తున్న పెద్ద కేసీఆర్ మీ కుటుంబ సభ్యుడు కాదా? గొల్లకురుమలు ఆలోచించాలి. 12వేలకోట్లతో గొల్లకురుమలకు కులవృత్తిని బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున జీవాలను అందించి పశుసంపదను రెట్టింపు చేసింది కేటీఆర్ కాదా? గంగపుత్రులు గుర్తించాలి. ఇవాళ చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసి, చెరువులను బాగు చేసి, మోపెడ్లు ఇచ్చి, వలలు ఇచ్చిన, బోట్లు ఇచ్చి ఫిషరీలో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపిన కేసీఆర్ మీ అన్న కాదా? చెట్ల పన్ను మాఫీ చేసి గౌడన్నలకు అండగా నిలిచింది కేసీఆర్ కాదా..?
నాయీ బ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇచ్చి సెలూన్లు, లాండ్రీలు ఇచ్చి పెద్ద దిక్కుగా నిలబడింది కేసీఆర్ కాదా? ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నయ్. ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా పథకాలు అమలు చేస్తున్నరు. విద్యార్థులకు 987 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి, విద్యార్థినిపై రూ.1.20లక్షలు ఖర్చుపెట్టి 5.50లక్షల మంది విద్యార్థులకు సంవత్సరానికి రూ.7వేలకోట్లు ఖర్చుపెట్టి వారికి బూట్లు, బట్టలు, పుస్తకాలు సర్వంచూసుకుంటూ ప్రపంచంతో పోటీపడేలా తయారు చేస్తున్న కేసీఆర్ వారికి తాత కాదా? బరాబర్ నాలుగుకోట్ల మంది తెలంగాణ బిడ్డలు కేసీఆర్ కుటుంబమే. ఇది వసుధైక కుటుంబం. మనకు కులం, మత పిచ్చి లేదు’ అన్నారు.