Navy Radar | వికారాబాద్, అక్టోబర్ 14, (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్ఎఫ్ నేవీ రాడార్ కేంద్రానికి మంగళవారం మధ్యాహ్నం 12.55 గంటలకు శంకుస్థాపన జరుగనున్నది. దామగుండం అడవి, పూడూరు మండల శివారు వికారాబాద్ మండలం టేకులబిడు తండా సమీపంలో భూమిపూజ కోసం శిలాఫలకాన్ని ఏర్పా టు చేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తోకలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. వికారాబాద్ కలెక్టరేట్ వద్ద హెలీప్యాడ్‌ను సిద్ధం చేయగా, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి నేవీ, మిలటరీ, పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశా రు. పదేండ్ల క్రితమే రాడార్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం ప్రక్రియ ప్రారంభించినప్పటికీ ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పెం డింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడంతో రాడార్ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించారు.
2900 ఎకరాల్లో 3200 కోట్లతో..
రూ.3200కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ రాడార్ కేంద్రం కోసం దామగుండం అటవీ ప్రాం తంలో 2900 ఎకరాల అటవీ భూములను నేవీకి అప్పగించారు. ఈ భూముల్లో లక్షా93 వేల చెట్లు, 400 ఎకరాల్లో గడ్డి భూములు ఉన్నాయి. 500 ఏండ్లనాటి రామలింగేశ్వర స్వామి ఆలయం, ఔషధ మొక్కలు, 258 రకాల పక్షిజాతులు, జింకలు, దుప్పిలు, నెమళ్లు ఉన్నాయి. ఈ కేంద్రంతో అటవీ సంపద నాశనం అవుతుందని, జీవవైవిద్యం దెబ్బతింటుందని పర్యావేరణవేత్తలు అభిప్రాయపడ్డారు. దామగుండంలో అడవుల్లో పుట్టే మూసీ, ఈసీ నదులు ప్రమాదంలో పడుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాడార్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా కోర్టుల్లో పర్యావరణవేత్తలు, దామగుండం అటవీ ప రిరక్షణ జేఏసీ అనేక పిటిషన్లు వేశారు. కానీ 2027 నాటికి ఈ రాడార్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది.
‘రాడార్’కు వ్యతిరేకంగా ఉద్యమం
పూడూర్ మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో వీఎల్ఎఫ్ రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలు, అటవీ ప్రేమికులు, స్థానిక ప్రజ లు ఉద్యమిస్తున్నారు. సేవ్ దామగుండం పేరిట ప్ర జాసంఘాలు, మేధావులు, పార్టీల నాయకులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు స్వచ్ఛందంగా తరలివచ్చి నిరసన వ్యక్తంచేస్తున్నారు. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌కు ఆనుకొని 10 గ్రామాలతోపాటు ఐదారు తండాలు ఉన్నప్పటికీ పూడూర్ గ్రామ ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే తీసుకోవడంపై మండిపడుతున్నారు. దామగుండం అటవీ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు.
చెట్ల నరికివేతపై రోజుకో మాట
దామగుండం అటవీ ప్రాంతంలో చెట్ల తొలగింపుపై అటవీ అధికారులు స్పష్టతనివ్వడం లేదు. మొదట కోర్టుకు సమర్పించిన సమాచారంలో 12 లక్షలకుపైగా చెట్లను తొలగించడం ఆవశ్యకమని పేర్కొన్నారు. ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అటవీ శాఖ రాష్ట్ర అధికారి 1.93 లక్షల చెట్లను మాత్రమే తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం 899 చెట్లను మాత్రమే తొలగించనున్నారని కోర్టుకు అటవీ శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని దామగుండం అటవీ పరిరక్షణ సభ్యులు, పర్యావరణవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీం స్టే తీసుకువస్తాం
రాడార్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. సుప్రీం కోర్టుకు వళ్లైనా స్టే తీసుకువస్తాం. మేం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. రాజస్థాన్‌లో ఎడారి ప్రాంతాలు, కొడంగల్‌లో బీడు భూములు చాలా ఉన్నాయి. ఈ కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం.
– దేవనోనిగూడెం వెంకటయ్య, దామగుండం అటవీ పరిరక్షణ జేఏసీ చైర్మన్
పోరాటం ఉధృతం చేస్తాం
ఆగమేఘాల మీద రాడార్ కేంద్రానికి భూమి పూజ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పునరాలోచన చేయాలి. ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా బాధాకరం. రానున్న రోజుల్లో పోరాటం మరింత ఉధృతం చేస్తాం. కోర్టు ద్వారా తప్పనిసరిగా విజయం సాధిస్తాం.
– రామన్న మాదిగ, దామగుండం అటవీ పరిరక్షణ జేఏసీ కో-ఆర్డినేటర్
మా ప్రాణాలూ ముఖ్యమే
దేశ రక్షణ ఒక్కటే కాదు.. మా ప్రాణాలు కూడా ముఖ్యం. రేడియేషన్ ప్రభావంతో అంగవైకల్యం, క్యాన్సర్‌లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. శాస్త్రవేత్తలు, వైద్యులు, పర్యావరణవేత్తలు, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. రాడార్ కేంద్రం ఏర్పాటుతో దామగుండంలో పుట్టిన మూసీ, ఈసీ నదుల మనుగడ ప్రశ్నార్ధకం కానున్నది.
– సత్యనారాయణ, దామగుండం అటవీ పరిరక్షణ జేఏసీ సభ్యులు