మహబూబ్‌నగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశవ్యాప్తంగా క్రియాశీల శక్తిగా బీఆర్ఎస్ ఎదగడం ఖాయమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ‘తెలంగాణ వస్తదని ఎవరన్నా నమ్మిండ్రా? కేసీఆర్ పట్టుబట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని తెచ్చుకోలేదా? రేపు ఢిల్లీని కూడా అట్లాగే సాధించుకుంటాం’ అని స్పష్టం చేశారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని పాత కలెక్టరేట్లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్లశ్రీనివాస్తో కలిసి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. జెడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కల్వకుర్తి ప్రాజెక్టుకు చంద్రబాబు హ యాంలో కొబ్బరికాయ కొడితే.. వైఎస్ సీఎం అయ్యా క వచ్చి మొక్క నాటుతుండే అని ఎద్దేవా చేశారు.
అయినా కూడా కల్వకుర్తి నీటిని తీసుకురాలేకపోయారని పేర్కొన్నారు. చంద్రబాబు ఈ జిల్లాను తొమ్మిదేండ్లు గుత్తపట్టిండని, అయినా కూడా మెడికల్ కాలే జీ రాకపాయే.. పాలమూరుకు నీళ్లు రాకపోయే అని ఎద్దేవా చేశారు. 60 ఏండ్లలో తెలంగాణకు మూడే మూడు మెడికల్ కాలేజీలు వస్తే 8 ఏండ్లలో 12 కాలేజీలు తెచ్చామని చెప్పారు. పాలమూరులో నర్సింగ్ కాలేజీ బిల్డింగ్‌కు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఆరు కోర్సులు ఉండే పారామెడికల్ కాలేజీకి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. త్వరలో మెడికల్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో క్యాత్లాబ్, క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి వస్తదని చెప్పారు. కేంద్రంలో మెడికల్ సీట్లు 71 శాతం పెరిగితే ఈ 8 ఏండ్లలో తెలంగాణలో 127 శాతం పెరిగాయని పేర్కొన్నారు.
చివరి స్థానంలో ఉండి మమ్మల్ని అంటారా?
‘దేశంలో ప్రజలకు వైద్యం ఎలా అందుతుందన్న దానిపై నీతి ఆయోగ్ తెలంగాణకు మూడో ర్యాంకు ఇచ్చింది. కానీ గద్వాలకు వెళ్లిన కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ అది లేదు.. ఇది లేదు అన్నారు. అసలు కేంద్రమే ర్యాంకింగ్ ఇచ్చినంక కేంద్ర మంత్రికి మాట్లాడే అర్హత ఉన్నదా? ఈ కేంద్రమంత్రిది యూపీనే కదా.. కేంద్రం ఆ రాష్ర్టానికి చిట్టచివరి స్థానం ఇచ్చింది. ఇగ ఆయనొచ్చి మనకు నీతులు చెబుతుండు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.