కందుకూరు, నవంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం మండల పరిధిలోని బేగరికంచ గ్రామం వద్ద ఏర్పాటుచేస్తున్న ఫోర్త్‌సిటీకి వేయనున్న రేడియల్ రోడ్డుకు భూములియ్యబోమని రైతులు తెగేసి చెబుతున్నారు. సోమవారం ఆయా గ్రామాల్లో సమావేశం అనంతరం రైతులు కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందించారు. కలెక్టర్‌కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తామంతా సన్న, చిన్నకారు రైతులమని, ఉన్న ఎకరం, రెండెకరాలు రోడ్డుకు పోతే బతికేది ఎలా? అని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం రోడ్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. రాచులూరు, తిమ్మాపూర్, బేగంపేట్, తుర్కగూడ, గాజులబుర్జుతండా, మీర్ఖాన్పేట్ మీదుగా వేసే రోడ్డులో దాదాపు 200 మంది రైతులకు చెందిన 100 ఎకరాల భూమి పోతుందని, దీంతో తాము ఉపాధి కోల్పోతామని కలెక్టర్‌కు వివరించారు. లక్షలాది రూపాయలకు ఎకరం పోతుండగా, కేవలం నామమాత్రపు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రైతులతోపాటు వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.
మణికొండ, నవంబర్ 18: వికారాబాద్ జిల్లా లగచర్లకు వెళ్తుండగా బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని నార్సింగి పోలీస్‌స్టేసన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో నియంతృత్వం రాజ్యమేలుతుందని ఆరోపించారు. అమాయకులైన గిరిజనుల భూములను అన్యాయంగా లాక్కోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దబాయింపులకు దిగడం అక్రమమని పేర్కొన్నారు. వారితోపాటు బీజేపీ నాయకులు టీ శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, భిక్షపతియాదవ్, శివరాజ్, నాగేశ్‌యాదవ్ తదితరులు ఉన్నారు.