Group 1 | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 నిర్వహణలో తీవ్ర వైఫల్యం చెందిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో డైవర్షన్ పాలిటిక్స్‌కు సిద్ధమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండటం, గ్రూప్-1లో పోస్టులు అమ్ముకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎప్పటిలాగే ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ సర్కారు తన అనుకూల మీడియాను వాడుకున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫార్ములా ఈ-రేస్ కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చినట్టు లీకులు రావడం ఇందుకు కారణమైంది. ఏసీబీ రిపోర్ట్ ఇచ్చిందంటూ ఆయా మీడియా చానళ్లలో బ్రేకింగ్‌లతో హడావుడి చేశారు. ఈ కేసులో దాదాపు 9 నెలల పాటు విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు.. మంగళవారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి నివేదికను అందజేశారు. ఆ నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి పంపనున్నట్టు తెలిసింది. విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు తీసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఫార్ములా-ఈ కేస్‌లో చార్జిషీటు దాఖ లు చేసేందుకు ఇటు గవర్నర్ నుంచి ప్రభుత్వం అనుమతి కోరనున్నట్టు తెలిసింది. ఈ కేసును మొదట్నుంచి లొట్టపీసు కేసుగా అభివర్ణిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్‌కు ఈ కేసులో అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేశారని సమాచారం. రూ.44 కోట్ల స్పాన్సర్‌షిప్‌ను ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పొందినట్టు ఏసీబీ ఆ నివేదికలో నివేదించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఫార్ములా-ఈ కేసులో భారీగా అక్రమాలు జరిగాయంటూ అనుకూల మీడియాకు లీకులు ఇవ్వడంతో.. వా రు వరసగా కథనాలు వండి వార్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూప్-1పై హైకోర్టులో తీర్పు రావడంతోనే ఫార్ములా-ఈ కేసును తెరపైకి తెచ్చారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌ను, ఐఏఎస్ ఆర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్‌రావును ఏసీబీ పలుమార్లు విచారించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పొలిటికల్ డైవర్షన్ కోసం గవర్నర్ నుంచి అనుమతి తీసుకొని ఏ1 నుంచి ఏ5 వరకూ చార్జిషీట్ దాఖలు చేయాలనే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలిసింది.