ACB | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విచారణకు హాజరైన సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు హైడ్రామా నడిపించారు. ఏసీబీ నోటీసుల మేరకు కేటీఆర్ తన న్యాయవాదులను తీసుకొని సోమవారం ఉదయం 10 గంటలకే బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకోగా అధికారులు గేటు బయటే ఆయనను అడ్డుకున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు పోలీసులు కేటీఆర్‌ను కారులోనే కూర్చోబెట్టి హైడ్రామా నడిపించారు. తమ విచారణకు కేటీఆర్ ఒక్కరే రావాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. తనతో లాయర్ రావాల్సిందేనని, ఏసీబీ అధికారులు తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే దానికి ఎవరు బాధ్యులని కేటీఆర్ మీడియా సాక్షిగా ప్రశ్నించారు. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు కేటీఆర్ దగ్గరకు విచారణాధికారి మాజిద్ అలీఖాన్‌ను పంపారు. ఆయనతో సహా అక్కడున్న పోలీసులు కేటీఆర్‌ను విచారణకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
అయితే, ప్రభుత్వ తీరుపై తనకు నమ్మకం లేదని, తాను లాయర్‌తో విచారణకు వస్తే భయమెందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఆర్పీసీ నోటీసుల ప్రకారం విచారణకు వస్తే.. లాయర్లు అవసరం లేదని ఏసీబీ అధికారులు చెప్పారు. లాయర్‌తో విచారణకు రావడం తన ప్రాథమిక హక్కు అని కేటీఆర్ వారికి వివరించారు. కొద్దిసేపు తర్జనభర్జన అనంతరం.. లాయరు లేకుండానే విచారణకు రావాలని ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్‌ను ఆదేశించారు. ఈసారి కూడా కేటీఆర్.. లాయర్తోనే విచారణకు హాజరవుతానని స్పష్టంచేశారు. అప్పటికే దాదాపు 40 నిమిషాలు కావడంతో.. ఆ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు కేటీఆర్ వాహనాన్ని కొంచెం లోపలికి అనుమతించారు. ఈ క్రమంలో ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ కేటీఆర్‌కు పరిస్థితి వివరించడంతో.. కేటీఆర్ లిఖితపూర్వకంగా వారికి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో దానిని క్షుణ్ణంగా చదివిన డీఎస్పీ.. దానిని రిసీవ్ చేసుకున్నట్టు సంతకం చేశారు. అనంతరం కేటీఆర్ అక్కడ్నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
500 మీటర్లలో 300 మంది పహారా
ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచే అటు ఏసీబీ ఆఫీసు, ఇటు తెలంగాణ భవన్ వద్ద భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వస్తారనే ఆలోచనతో.. తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీసు వరకూ సోమవారం ఉదయం 300 మందికిపైగా పోలీసులను మోహరించారు. ఏసీబీ ఆఫీసుముందు సుమారు 150 మంది పోలీసులు పహారాకాశారు. మీడియాకు సైతం ప్రత్యేకంగా బారికేడ్లు పెట్టి, ఆఫీసు ముందే నిలువరించారు. తెలంగాణ భవన్‌వద్ద బందోబస్తును డీసీపీ ర్యాంకు అధికారి పర్యవేక్షించారు.
9న మరోసారి హాజరుకండి: ఏసీబీ
ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ ఏసీబీ మరోసారి కేటీఆర్‌కు నోటీసులు జారీచేసింది. విచారణకు న్యాయవాదులతోనే వస్తానని కేటీఆర్ స్పష్టంచేసిన నేపథ్యంలో సోమవారం ఉదయం ఆయన వెళ్లిపోయిన నిమిషాల వ్యవధిలోనే ఏసీబీ అధికారులు తమ లీగల్ టీమ్‌తో సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని తమ కార్యాలయంలో ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ లాయర్‌తో విచారణకు హాజరైతే వచ్చే ఇబ్బందులపై ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిసింది. ఎలాగైనా ఈ కేసులో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డు చేయాలనే ఉద్దేశంతో మరోసారి నోటీసులు ఇచ్చే అంశాన్ని చర్చకు పెట్టినట్టు సమాచారం. అనంతరం ఈ నెల 9న కేటీఆర్‌ను మరోసారి విచారణకు పిలువాలని ఏకగ్రీవంగా తీర్మానించి.. నోటీసులు ఇచ్చారు.