హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 విషయంలో భేషజాలకు పోవద్దని పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు సీ విఠల్ ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి సూచించారు. పైకోర్టులకు వెళ్లి అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని హితవు పలికారు. గ్రూప్-1పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు విఠల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. గ్రూప్-1 విషయంలో టీజీపీఎస్సీ అభాసుపాలైందని, అప్రతిష్ఠను మూటగట్టుకున్నదని విమర్శించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కమిషన్‌కు ఇది మాయనిమచ్చని, విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. ఉద్యోగులను రిక్రూట్ చేయాల్సిన కమిషన్‌లోనే ఉద్యోగులు లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు. కమిషన్‌ను సిబ్బంది కొరత సమస్య వేధిస్తున్నదని, అనుభవం గల వారంతా రిటైర్మెంట్ అవుతున్నారని పేర్కొన్నారు. ఈ 20 నెలల్లో ఉద్యోగులను ఎందుకు రిక్రూట్ చేయలేదని ప్రశ్నించారు.
మేం ఆదర్శంగా నిలబెట్టినం
“తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్తగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. అనేక సమస్యలు, సవాళ్లు పీడించినా మేం లెక్కచేయలేదు. ఉద్యోగాల భర్తీ విషయంలో మేం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదర్శంగా నిలబెట్టినం. దేశంలోనే మొదటిసారి 40 వేల మందికి ఒకేసారి ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించినం. తెలంగాణ ఏర్పాటు తర్వాత 160 పోస్టుల భర్తీకి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి, పకడ్బందీగా ఇంటర్వ్యూలు నిర్వహించాం. అవినీతికి తావులేకుండా ఉద్యోగాలు భర్తీచేశాం. ఇంటర్వ్యూ విధానంలో పేరు, కులం, మతం, రిజర్వేషన్ వ్యక్తిగత వివరాలను అడగొద్దని నిషేధించాం. 36 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశాం. గ్రూప్-2, 3, 4, టీఆర్టీ రిక్రూట్‌మెంట్‌ను విజయవంతంగా పూర్తిచేశాం. జీవోలు, అర్హతలపై చిన్న చిన్న కోర్టుకేసులు, కొందరు కోర్టుకెళ్లడంతో ఆలస్యమయ్యిందే తప్ప ఇంత పెద్ద తప్పిదాలు మా హయాంలో జరగలేదు” అని విఠల్ వివరించారు.
మూల్యాంకనం లోపాలపుట్ట
“గ్రూప్-1 మూల్యాంకనం విషయంలో రూల్స్, నిబంధనలున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. కానీ ఈ నిబంధనలను పట్టించుకోలేదు. దీంతో అనేక తప్పులు జరిగాయి. మాడరేషన్ మెథడ్‌ను అనుసరించలేదు. సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ల చేత మూల్యాంకనం చేయించాల్సి ఉండే. కానీ కాంట్రాక్ట్, తాత్కాలిక సిబ్బంది, ప్రైవేట్ లెక్చరర్లతో మూల్యాంకనం చేయించినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఫలితాలు త్వరగా ఇవ్వాలన్న ఆత్రుతలో మెయిన్స్ పరీక్షలు ముగిసిన మూడో రోజు నుంచే మూల్యాంకనం ప్రారంభించారని, త్వరగా మూల్యాంకనం పూర్తిచేయాలని ఒత్తిడి తెచ్చారని నిరుద్యోగులంటున్నారు. రోజుకు 20 పేపర్లు దిద్దాల్సి ఉండగా, రోజుకు 80-100 దిద్దించారని చెప్తున్నారు. మాడరేషన్ను అనుసరించలేదని హైకోర్టు కూడా చెప్పింది” అని విఠల్ తెలిపారు.
పై కోర్టులకెళ్తే నష్టమే
గ్రూప్ -1 విషయంలో టీజీపీఎస్సీ, ప్రభుత్వం భేషజాలకు పోకూడదని విఠల్ పేర్కొన్నారు. తప్పిదాలను గ్రహించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలే తప్ప పైకోర్టుకెళితే మరింత నష్టం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ‘గ్రూప్-1లో పారదర్శకత లోపించిందని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. టీజీపీఎస్సీ అసమర్థతను తప్పుబట్టింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పై కోర్టులు కొట్టివేస్తాయని అనుకోవడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో అప్పీల్కెళ్లినా, సుప్రీంకోర్టుకెళ్లినా ఉపశమనం దొరకడం కష్టమే. సుప్రీంకోర్టుకు వెళ్తే ఏడాది, ఆరునెలలు పట్టొచ్చు. కోర్టులకు వళ్లడం కన్నా రీనోటిఫికేషన్ జారీచేయడమే ఉత్తమం’ అని వివరించారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
ఎన్నికలకు ముందు రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, జాబ్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేసిందని విఠల్ తెలిపారు. కాంగ్రెస్ హామీలను నిరుద్యోగులు నమ్మారని, కానీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో అబద్ధాలాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్తు రంగం, ఆర్థికరంగంపై సర్కారు శ్వేతపత్రాలు విడుదల చేసి అసెంబ్లీలో చర్చకు పెట్టిందని, ఇదే తరహాలో ఉద్యోగాల భర్తీ విషయంలోను శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఎన్ని నోటిఫికేషన్లు విడుదల చేశారు? ఎన్ని ఉద్యోగాలను భర్తీచేశారో బహిరంగంగా వెల్లడించాలని విఠల్ డిమాండ్ చేశారు.