ఖైరతాబాద్, నవంబర్ 6 : భారతదేశ సార్వభౌమత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిసత్ తీవ్రంగా ఖండించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియా సమావేశంలో పరిషత్ అధ్యక్షులు కల్నల్ సుంకరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి పాకిస్థాన్‌ను వివిధ వ్యాఖ్యలతో పొగుడుతూ భారత సైనిక సామర్థ్యాన్ని కించపరుస్తూ ‘పాకిస్థాన్ భారతదేశాన్ని నడ్డిమీద తన్నింది’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. సీఎం వ్యాఖ్యలు యావత్ భారతదేశంలోని సైనికుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం దేశ సార్వభౌమత్వాన్ని కించపరచడం సిగ్గుచేటని మండిపడ్డారు. పహల్గామ్ దాడిలో సామాన్యులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు 26 మంది మహిళల సిందూరాన్ని చెరిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను తుదముట్టించి ఉగ్రవాదులను అంతమొందించిందన్నారు. భారత త్రివిధ దళాలు చూపించిన పరాక్రమాలను చూసి ప్రపంచమే నివ్వెరపోయిందన్నారు.
కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చీప్ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. తాను మాజీ సైనికుడినని చెప్పుకొనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చే మాటలు చెప్పాలన్నారు. ఎస్ఎల్బీసీ విషయంలో ఒరగబెట్టలేని ఉత్తమ్ ఎలా స్పందిస్తారో వేచిచూస్తామన్నారు. రాష్ట్రంలో 50 వేలకు పైగా మాజీ సైనిక కుటుంబాలున్నాయని, వారికి చెందాల్సిన భూములు కబ్జా అవుతున్నాయని ఆరోపించారు. వారి కుటుంబాలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా మాజీ సైనికులను సెక్రటేరియట్ పిలిచి మాట్లాడలేదన్నారు. ఎన్నికల ముందు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీని మరిచిపోయారని ఎద్దేవా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మరింత బాధ కలిగించాయని చెప్పారు. సైన్యంలో కులమతాలు ఉండవని, సైనికులను అడ్డం పెట్టుకొని కుల, మత రాజకీయాలు చేయాలనుకోవడం విచారకరమన్నారు. రక్షణ రంగంలో కుల రిజర్వేషన్ అనేదే ఉండదని, దేశానికి సేవ చేయాలన్న తపన ఉన్న ఎవరైనా సైన్యంలో చేరవచ్చని వివరించారు. రాహుల్ గాంధీ ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడో, ఆయనకు చదువెవరు చెప్పారో అర్థం కావడం లేదన్నారు. మరోసారి సైన్యం ధైర్యసాహసాలను, సామర్థ్యాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.