హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు శుక్రవారం సిట్ ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. వారంపాటు కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించగా, ఆయన సిట్ చీఫ్ ఏసీపీ వెంకటగిరి, ఇతర అధికారుల నుంచి విచారణ ఎదుర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఐక్లౌడ్ పాస్వర్డ్స్ ఇచ్చినట్టు తెలిసింది. ఇదివరకు ఈ కేసు విచారణను పర్యవేక్షించిన విజయ్‌కుమార్ సిద్దిపేట సీపీగా బదిలీకాగా, ఆయన స్థానంలో ఐపీఎస్ తఫ్సీర్ ఇక్బాల్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ విచారణకు సంబంధించిన నివేదికను సిట్ డిసెంబర్ 19న సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉన్నది.