హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచులు నిరసన చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాజీ సర్పంచులు శనివారం కార్యాలయం గేటుకు వినతిపత్రం ముడుపు కట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు పెండింగ్ బిల్లులు మంజూరు కోసం అనేకమార్లు గవర్నర్, సీఎం, మంత్రులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
గ్రామాభివృద్ధి పాటుపడిన మాజీ సర్పంచులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, కేశబోయిన మల్లయ్య, రాజేందర్, రవీందర్రావు, రవి, నాయకులు ఎల్లారెడ్డి, అరవింద్, బోట్ల రవి తదితరులు పాల్గొన్నారు.