హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): గ్రామాల అభివృద్ధికి పాటుపడిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు 22నెలలుగా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుని త మకు న్యాయం చేయాలని డీజీపీని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది. ఈ మేరకు మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డికి వినతిపత్రం అందజేసింది. చెక్ బౌన్స్ కేసులు ఏ విధంగా నమోదు చేస్తారో ఆ విధంగా సర్పంచులకు చెకులు జనరేషన్ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది. సీఎం, మంత్రులు, పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది. బిల్లులు రాకపోవడంతో కుటుంబ పోషణకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నది. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, నాయకులు గుంటి మధుసూదన్‌రెడ్డి, రాంపాక నాగయ్య, మాట్ల మధు తదితరులు పాల్గొన్నారు.