హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు ఐదోసారి శుక్రవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో ప్రజాభవన్లో ప్రజాపాలన ప్రత్యేకాధిరాణి దివ్యదేవరాజన్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ చేసిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. దీంతో అప్పుల భారం పెరిగి అనేకమంది మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.