Parakala | పరకాల, మే 13: పదవిలో ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు చేపట్టిన సర్పంచ్లు వాటి బిల్లుల కోసం ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాజా మాజీ సర్పంచ్లు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. హనుమకొండ జిల్లా నడికుడ మండలం పులిగిల్ల గ్రామ తాజా మాజీ సర్పంచ్ పాలకుర్తి సదానందం దంపతులు బిల్లులు రాని కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉపాధి హామీలో కూలీ పనులకు వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. శ్మశానవాటికల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు, నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు, సీసీ రోడ్లు తదితర పనుల కోసం గ్రామాలకు లక్షలాది రూపాయ ల నిధులు కేటాయించారు. దీంతో గ్రామాల్లో పనులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో లక్షల రూపాయలు అప్పులు తెచ్చిమరీ పనులు చేశారు. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక మాజీ సర్పంచ్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
లక్షల రూపాయలు వెచ్చించి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల దాకా బిల్లులు రావాల్సి ఉన్నది. వడ్డీలు పెరిగిపోతున్నాయి. ప్రతినెలా వడ్డీ చెల్లించలేని దుస్థితిలో ఉన్నా. ప్రభుత్వం మారిన నాటి నుంచి వడ్డీలకే రూ.4 లక్షలు చెల్లించాను. ప్రభుత్వం బిల్లులు చెల్లించాలి. లేదంటే ఆత్మహత్యే శరణ్యం.