గొల్లపెల్లి, జూన్ 24 : గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఓ మాజీ సర్పంచ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చే దారిలేక సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం బీబీరాజ్పల్లిలో చోటుచేసుకున్నది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీరాజ్పల్లికి చెందిన దాసరి శంకరయ్య(50) అప్పు చేసి రూ.10 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించాడు. ఇందుకు సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు రాలేదు. దీంతో తెచ్చిన అప్పులు పెరిగాయి. ఇదే సమయంలో కొడుకును విదేశాలకు పంపే ప్రయత్నంలో విఫలమై మరికొంత అప్పుల్లోకి కూరుకుపోయాడు. ఇందుకోసం తన మామిడి తోటను కూడా అమ్ముకున్నాడు. అయినప్పటికీ అప్పులు తీరలేదు. అప్పుల బాధ ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన సోమవారం గ్రామంలోని ఓ మామిడితోటలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం జగిత్యాల దవాఖానకు తరలించారు.
జగిత్యాల, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : మాజీ సర్పంచ్ శంకరయ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. అప్పుచేసి అభివృద్ధి పనులు చేపట్టిన శంకరయ్యకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఆయన కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోవారు యారు.