పెంబి, నవంబర్ 27 : అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ మాజీ సర్పంచ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెంబి మాజీ సర్పంచ్ పూర్ణచందర్గౌడ్ ఏడాది క్రితం మండల కేంద్రంలో డ్రెయినేజీ, రోడ్లను నిర్మించాడు. దాదాపు రూ.25 లక్షల వరకు నిధులు వెచ్చించాడు. ప్రభుత్వానికి బిల్లులు సమర్పించి డబ్బుల కోసం వేచి చూస్తున్నాడు. ఏడాది కాలంగా బిల్లులు రాకపోవడంతో మనస్తాపం చెందాడు. పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన ఆయన బుధవారం తిరిగి వస్తూ నిర్మల్ సమీపంలోకి రాగానే బస్సులోనే పురుగుల మందు తాగాడు. నిర్మల్లో బస్సు దిగి నేరుగా దవాఖానకు వెళ్లి జాయిన్ అయ్యాడు. ఆ వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పురుగుల మందు తాగినట్టు తెలిపాడు. అతని ఆరోగ్య పరిస్థితిపై 24 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు.