నారాయణఖేడ్, డిసెంబర్ 2: మెరుగైన విద్యాను అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని భ్రష్టుపట్టిస్తున్నదని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మండిపడ్డారు. గురుకుల బాటలో సోమవారం జూకల్ శివారులోని బీసీ గురుకుల సందర్శనకు వెళ్లిన భూపాల్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాలను ప్రభుత్వం పట్టించుకోనందునే 50 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, వందల మంది విద్యార్థులు కలుషిత ఆహారం, నీటి వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాలను ప్రభుత్వం సక్రమంగా నిర్వహిస్తే తాము సందర్శించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. విద్యార్థులకు భరోసా కల్పించేందుకు విద్యాలయాలను సందర్శించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు.
గోదావరిఖని, డిసెంబర్ 2: రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మైనారిటి గురుకుల పాఠశాలను చందర్, బీఆర్ఎస్ నేతలు సందర్శించారు.పాఠశాల సిబ్బంది గేటు వేసి బీఆర్ఎస్ నేతలను లోనికి రాకుండా అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోనికి రాకూడదని చెప్పడంతో అక్కడే వేచి ఉండి విరామ సమయంలో బయటకు వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, విలేకరులతో మాట్లాడారు. గురుకులాల బాటలో భాగంగా విద్యార్థుల స్థితిగతులను తెలుసుకునేందుకు వస్తే పాఠశాల అధికారులు అనుమతి లేదని అంటున్నారని, పోలీసులతో అడ్డుకుంటున్నారని, ఇది దుర్మార్గపు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.