నల్లగొండ, జూన్ 23: నల్లగొండ కలెక్టర్ తీరుపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై నివేదించేందుకు 26 సార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా అందుబాటులోకి రాకపోవడంపై మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలవటానికి ప్రయత్నించగా ఆమె అపాయింట్మెకంట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆ వెంటనే గ్రీవెన్స్ హాల్లోకి వెల్లి కలెక్టర్‌పై అసహనం వ్యక్తంచేశారు. తాను నకిరేకల్ ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికయ్యానని, నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్న తాను పలు సమస్యలపై విన్నవించటానికి 26 సార్లు ఫోన్ చేస్తే ఎత్తి సమాధానం ఇవ్వకపోవటం సరికాదనడంతో పాలీసులు ఆయన్ను హాల్ నుంచి బయటకు పంపారు.
ఈ సందర్బంగా చిరుమర్తి మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్‌కు నకిరేకల్ సమస్యలు విన్నవించటానికి 26 సార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయకపోవడంతో నేరుగా వచ్చినా సమయం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ వాణిశ్రీ అర్జీలను కలెక్టర్ పట్టించుకోకుండా దాటవేస్తూ స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో వారిని రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపించారు. అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు అధికారులు తప్పుడు నివేదికలు రూపొందిస్తూ ఇటీవల కేతెపల్లి పంచాయతీ కార్యదర్శిపై వేటు వేశారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు అధికారుల అండదండలతో చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ వ్యవసాయ క్షేత్రంలో భవనాలను నేలమట్టం చేయించినట్టు చెప్పారు. అధికారులు ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అధికారులు పరిధి దాటి పనిచేస్తే కేసీఆర్ సీఎం అయ్యాక మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.