వినోద్‌కుమార్ న్యూశాయంపేట, మార్చి 2: మామునూరులో ఎయిర్‌పోర్టును తామే తీసుకొచ్చామంటూ బీజేపీ, కాంగ్రెస్ కొట్లాట చూస్తే నవ్వొస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఎయిర్‌పోర్టు రావడం వెనుక బీఆర్ఎస్ కృషి ఎంతో ఉన్నదని చెప్పారు. తాము తీసుకున్న చొరవ, శ్రమను చెప్పుకోవాల్సిన అవసరం లేదని, తమది ఉద్యమ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. మామునూరు ఎయిర్ పోర్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఎయిర్‌పోర్టును తానే తీసుకొచ్చానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం తెలంగాణ ప్రజలు, ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపర్చినట్టు అవుతుందని తెలిపారు. దీన్ని రెండో ప్రపంచయుద్ధం జరిగేటప్పుడు ఎయిర్ స్ట్రిప్‌గా ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. 1976-78 కాలంలో వాయుదూత్ సర్వీస్ నడిచేదని.. 1980 తర్వాత మూతపడిందని చెప్పారు.
తాను ఎంపీగా ఉన్నప్పుడే అప్పటి కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్‌కు ప్రశ్న రాస్తే.. శంషాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో పెట్టొద్దని జీఎంఆర్ సంస్థకు 25 ఏండ్లు రాసిచ్చామని 2005-06లో రిైప్లె వచ్చిందని.. ఆ అగ్రిమెంట్ మేరకు అందరూ ఆగిపోయినట్టు తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టు కోసం తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజుల్లోనే కేసీఆర్ కృషి చేశారని.. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుందని ప్రయత్నం చేసి వారిని ఒప్పించినట్టు చెప్పారు. కేటీఆర్‌తో కలిసి వెళ్లి కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పురిని మామునూరు అంశంపై మాట్లాడి ఒప్పించామని, బీఆర్ఎస్ కృషి లేదని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌ను మామునూరుకు తీసుకురావాలని రేవంత్ సరార్ను డిమాండ్ చేశారు. బోయింగ్, ఎయిర్ బస్, ఇండిగో లాంటి సంస్థల విమానాల రిపేరింగ్ సెంటర్స్ వరంగల్‌కు తీసుకురావాలని, దీనికోసం ఇప్పటికే నాగ్‌పూర్, అమరావతి పోటీపడుతున్నట్టు చెప్పారు.
పన్ను రాయితీలు ఇచ్చి మామునూరుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు. 253 ఎకరాలు బీఆర్ఎస్ హయాంలోనే గుర్తించి రైతులతో సంప్రదింపులు జరిపామని, మామునూరు ఎయిర్‌పోర్టు క్రెడిట్ వీసమెత్తు కూడా రేవంత్‌రెడ్డికి దకదని వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీ ఏనాడూ వరంగల్‌ను పట్టించుకోలేదని, చేయని పనికి స్వీట్లు పంచుకుంటున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ దుయ్యబట్టారు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకుకర్మాగారం విభజన చట్టంలో పొందుపరిచేలా చేసిన గొప్ప నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. వీటన్నింటికీ కనెక్టివిటీ ఉండాలని తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లోనే ఎయిర్పోర్ట్ అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.