హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)ని సాకుగా చూపి యాసంగి పంటకు నీళ్లివ్వకుండా తప్పించుకుంటే అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విమర్శించారు. ప్రాజెక్టు రిపేర్లకు, గేట్లు మూసి నీళ్ల ఎత్తిపోసేందుకు ఎన్డీఎస్ఏ అనుమతి అవసరం లేదని స్పష్టంచేశారు. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసి ప్రాజెక్టులు నింపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని చెప్పారు. ఈ విషయం డ్యామ్ సేఫ్టీ చట్టం-2021లో స్పష్టంగా ఉన్నదని తెలిపారు.
కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కార్మిక విభాగం నేత రూప్సింగ్, నాయకులు రవికుమార్‌నాయక్, చిలుక పెంటయ్య, ఊకంట యాకూబ్రెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో వినోద్‌కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎస్సారెస్పీ ఫేజ్-1, ఫేజ్-2 ద్వారా నీళ్లివ్వలేమని, యాసంగి వరి తకువ వేసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి సూచిస్తున్నట్టు తెలుస్తున్నదని చెప్పారు. వానకాలంతో ఎకరాకు 27 క్వింటాళ్ల ధాన్యం వస్తే, యాసంగిలో 30 క్వింటాళ్ల వరకు వస్తుందని, యాసంగికి నీళ్లివ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
‘గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నయి. ప్రాణహిత బ్రహ్మాండంగా ప్రవహిస్తున్నది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నీళ్లు లిఫ్టు చేసే అవకాశం ఉన్నది. వేల టీఎంసీల నీళ్లు ప్రవహించినా మేడిగడ్డ డ్యామ్‌కు ఏమీ కాలేదు. ఇప్పటికే వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనయి, రైతుల యాసంగి పంటకు చివరి తడికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. కేసీఆర్‌ను బద్నాం చేయడానికి మేడిగడ్డ కుంగిందని చెప్పి కాంగ్రెస్ నేతలు అసత్యప్రచారం చేస్తున్నరు.
వారం క్రితం మేడగడ్డ దగ్గర రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం వస్తే బరాజ్ మిల్లీ మీటర్ కూడా కదల్లేదు. ఇంకేం కావాలయ్యా రేవంత్‌రెడ్డీ? సృష్టే ప్రశ్నించింది. ఇది మంచిగున్నదా? లేదా? గట్టిగున్నదా? లేదా? అని సృష్టే తెలుసుకున్నది. భూకంపం వచ్చినా మేడిగడ్డ చెక్కుచెదరలేదు. అంత బ్రహ్మాండంగా ఉన్నది. చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దాలి. అంతేగాని, చట్టం పేరు చెప్పి ఎన్డీఎస్ఏ పర్మిషన్ ఇవ్వాలనే నెపంతో వాయిదా వేయకండి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డీ.. ఐదారేండ్లుగా కాకతీయ కెనాల్లో నీళ్లు వదలడం వల్ల మీ సూర్యాపేట జిల్లాలో పుష్కలంగా పంటలు పండినయి.
అధికారులతో మీటింగ్ పెట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను అడిగి, ఆ చర్యలు తీసుకొని మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లు వేసి ఫిబ్రవరి, మార్చి నెలల్లో అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లి, శ్రీపాద, మిడ్‌మానేరు, ఎల్ఎండీ ప్రాజెక్టులను నింపి కాకతీయ కాల్వలోకి నీళ్లు వదలండి. అప్పుడు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు పుష్కలంగా నీళ్లు వస్తయి. యాసంగి పంటలకు నష్టం కలగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి’ అని వినోద్ డిమాండ్‌చేశారు.