రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తులు సృష్టించిందని, తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి అప్పగించిందని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. అప్పుల రాష్ట్రమంటూ అసత్య ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన సిరిసిల్లలోని తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్వోటీఆర్ ప్రాపర్టీ ట్యాక్స్‌లో 84.2% తెలంగాణ సొంత నిధులు ఉన్నాయని, హర్యానా 86.9%తో మొదటి స్థానంలో ఉన్నదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలైన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాలన్నీ తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవని వివరించారు. కొన్ని రాష్ర్టాలు 30% కూడా లేవని, 70% నిధులు కేంద్రమే ఇస్తున్నదని చెప్పారు. జార్ఖండ్, ఒడిశా 54 శాతమేనని, కేంద్రం 46% ఇస్తే ఆ రాష్ర్టాలు బతికి బట్టకట్టాయని తెలిపారు.
తెలంగాణను అప్పుల రూపంలో చూపిస్తున్నారే కానీ, స్థిరాస్తుల లెక్కలు ఎందుకు చెప్పడం లేదని వినోద్‌కుమార్ నిలదీశారు. అప్పులు తెచ్చి కట్టిన ప్రాజెక్టులు, భవనాలు, సబ్స్టేషన్లు వంటి వాటి విలువ నేడు ఎంత మేర పెరిగిందో లెక్కలు వేసుకోవాలని సవాల్ చేశారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలు, సీతమ్మ ప్రాజెక్టు, ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చుల విలువ పెరగలేదా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టిన రోజు టన్ను స్టీల్ ధర రూ.27 వేలు ఉంటే నేడు రూ.70 వేలకు పెరిగిందని తెలిపారు. 2014-16లో భూసేకరణకు రూ.2 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఇస్తే రైతులు సంతోషంగా తీసుకున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం లక్షల ఎకరాలు భూసేకరణ చేసిందని వివరించారు. నేడు రూ.26 లక్షలు పెట్టినా ఎకరం భూమి దొరకదని పేర్కొన్నారు. సేకరించిన ఆస్తి తెలంగాణది కాదా? నాడు సేకరించిన భూములు నేడు ఆ ధరకు దొరుకుతాయా? అని ప్రశ్నించారు.
వేల కోట్ల విలువ గల ఆస్తులు కూడబెట్టి ఇప్పటి ప్రభుత్వానికి అప్పగించామని చెప్పారు. అందుకే తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి అప్పగించినట్టు చెప్తున్నామని స్పష్టం చేశారు. అమెరికా, చైనా, జపాన్ ఎక్కువ అప్పులు తీసుకుని ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయని చెప్పారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఒక బైక్ కొనుక్కున్నా ఈఎంఐ చెల్లిస్తాయని, అంటే అప్పులు చేసినట్టు కాదని స్పష్టంచేశారు. అప్పులంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయవద్దని హితవు చెప్పారు. తీసుకున్న అప్పుల్లో ఒక్క ఇన్స్టాల్మెంటు కూడా ఎగ్గొట్టలేదని స్పష్టంచేశారు. అప్పులు కూడా పదేండ్ల తర్వాత తీర్చాల్సి ఉంటుందని, అయినప్పటికీ నెలనెలా చెల్లించామని చెప్పారు. సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు బొల్లి రామ్మోహన్, బండ నర్సయ్య పాల్గొన్నారు.
తెలంగాణకు 27.8% అప్పులు ఉంటే.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాలతో సహా 22 రాష్ర్టాలకు తెలంగాణ కన్నా ఎక్కవ అప్పులు ఉన్నాయని వినోద్‌కుమార్ వివరించారు. దీనిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై అభాండాలు వేశారని, పదేపదే అసత్యపు ప్రచారాలను సోషల్ మీడియాలో వైరల్ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరి మీద రూ.5 లక్షల అప్పు చేశారంటూ కాంగ్రెస్ చేసిన అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టడంలో తాము విఫలమైనట్టు పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. జీతాలు ఇవ్వడం లేదని విమర్శించే ముందు ఆ పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో మూడు, నాలుగు నెలలకోసారి ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్న విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని మండిపడ్డారు. ఉద్యోగుల జీతాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ ఎగ్గొట్టలేదని స్పష్టం చేశారు. పెద్ద ప్రాజెక్టులు కట్టినందున, వాటిపై నిధులు ఖర్చుచేసినట్టు తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడినపుడు విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 7,770 మెగావాట్లు ఉంటే నేడు 26 వేల మెగావాట్లకు పెంచామని గుర్తుచేశారు.