హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం-మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లర్లు ఒక్క మిల్లీ మీటర్ కూడా చెక్కు చెదరలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. ఈ వర్షాకాలంలో లక్షలాది క్యూసెక్కుల వరద నీళ్లు పారినా మేడిగడ్డ బరాజ్‌కు ఏమీ కాలేదని తెలిపారు. కేసీఆర్ మీద దుష్ప్రచారం చేయడం మానేసి, ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమ్మక్క సాగర్ బరాజ్‌కు అనుమతులు సాధించినట్టు కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గొప్పలు చెప్పకొంటున్నారని, ఈ ప్రాజెక్టు కింద 50 ఎకరాల ముంపునకు సంబంధించి ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకొని, ఏదో సాధించినట్టు, ఈ బరాజ్‌కు కొత్తగా అనుమతులు వచ్చినట్టు డబ్బా కొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఉద్యమాలకు భయపడి..
2001లో కేసీఆర్ మొదలు పెట్టిన తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని వినోద్‌కుమార్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్న క్రమంలో అప్పట్లో రూ.811 కోట్లు కేటాయిస్తూ వెంటనే జీవో కూడా విడుదల చేశారని చెప్పారు. అయితే ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో 2009లోనే మొదటి దశ పూర్తయిందని, దీని కోసం రూ.15వేల కోట్ల నుంచి నుంచి 20వేల కోట్లు నాటి ముఖ్యమంత్రి ఖర్చు పెట్టినా, ఆ ప్రాజెక్టు నుంచి సరిగ్గా నీళ్లు తోడలేకపోయారని విమర్శించారు. ఇన్‌టేక్ వెల్ కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేకపోయారని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టు నుంచి 170రోజులు నీళ్లు తోడాల్సి ఉండగా.. కేవలం 110రోజులకు కూడా తోడలేకపోయారని నిప్పులు చెరిగారు.
అయినా కాంగ్రెస్‌ను నిందించలే
దేవాదుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కేసీఆర్ ఆ ప్రాజెక్టును సరిదిద్దారని వినోద్‌కుమార్ వివరించారు. దేవాదులను పటిష్టం చేసేందుకే 7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సాగర్ బరాజ్‌ను కేసీఆర్ కట్టించారని తెలిపారు. సమ్మక్క బరాజ్ కు ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలతో సీడబ్ల్యూసీ అ నుమతులు ఇవ్వలేదని చెప్పారు. 2023 ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్ర భుత్వం ఉండటంతో ఇక్కడి కాంగ్రెస్ నాయకులు, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కేసీఆర్‌కు అనుమతులు దక్కకుండా చేశారని మండిపడ్డారు. అప్పుడు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సంతకం చేసిన ఒప్పంద పత్రాన్ని మంత్రి ఉత్తమ్ తీసుకొచ్చి ఇప్పుడు గొప్పలు చెప్పుకొంటున్నారని దుయ్యబట్టారు.
దేవాదుల నీటి నిల్వ కోసం 10 రిజర్వాయర్లు
దేవాదుల నుంచి నీళ్లు తెచ్చి వాటిని నిల్వ చేసుకోడానికి ఏకంగా 10 రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కేసీఆర్‌దేనని బోయినపల్లి కొనియాడారు. కేవలం 50 ఎకరాల ముంపు భూమి కోసం చేసుకున్న ఒప్పందానికే కాంగ్రెస్ ఇంతగా ప్రచారం చేసుకుంటే.. ఎన్నో ప్రాజెక్టులను సాధించిన కేసీఆర్ ఎంతగా ప్రచారం చేసుకోవాలని ప్రశ్నించారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
పెండింగ్ ప్రాజెక్టులు, రిజర్వాయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లివ్వాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. అలాగే మేడిగడ్డకు మరమ్మతులు చే టపట్టి అందుబాటులోకి తేవాలని కోరారు. తమ్మడిహట్టి వద్ద బరాజ్ కోసం మహారాష్ట్రతో చర్చలు జరుపుతామని రేవంత్‌రెడ్డి అంటున్నారని, 152 మీటర్లకు తగ్గకుండా బరాజ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు కేంద్ర ప్రభు త్వం రూ.20వేల కోట్లు ఇస్తున్నదని, వాటితో ఆ రెండు రాష్ర్టాలు బరాజ్‌ల నిర్మాణానికి సన్నద్ధమవుతున్నాయని బోయినపల్లి తెలిపారు. ఒకవేళ ఆ నదులపై ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తమ్మిడిహట్టి వద్ద అనుకున్నంత నీటి లభ్యత ఉండదని స్పష్టంచేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.