హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని, ఇందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విజ్ఞప్తిచేశారు. తెలంగాణభవన్‌లో గురువారం బీఆర్ఎస్ లీగల్‌సెల్ ఇన్చార్జి సోమా భరత్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 డిసెంబర్ 31న లోక్‌సభలో వేసిన ప్రశ్న ఫలితంగా తెలంగాణకు హైకోర్టు వచ్చిందని గుర్తుచేశారు.
తెలంగాణ హైకోర్టుకు 42 మంది జడ్జీలు ఉండాలని నిర్ణయం తీసుకున్నా, 23 మందికి మించి భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పూర్తిస్థాయిలో జడ్జీలను నియమిస్తే ఎంతోమంది అర్హులైన దళిత, గిరిజనవర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కేసీఆర్ హయాంలో తాము పార్లమెంటులో చేసిన ఒత్తిడి ఫలితంగానే హైకోర్టు జడ్జీల సంఖ్యను 42కు పెంచారని గుర్తుచేశారు. హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నదని, న్యాయమూర్తులు పూర్తిస్థాయిలో ఉంటే తప్ప కేసులు త్వరితగతిన పరిషారం కావని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు మెట్రో రైలుమార్గాన్ని పొడిగించడంతోపాటు డబుల్ డెకర్ సైవే నిర్మించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. అప్పుడే సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు కరీంనగర్-హైదరాబాద్ మధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు మెట్రోమార్గాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని చెప్పారు.
పైన మెట్రో, మధ్యలో ఫ్లైఓవర్, కిందిభాగంలో రోడ్డు కలిపితే డబుల్ డెకర్ సైవే అంటారని, వీటిని నాగ్‌పూర్, జైపూర్‌లో నిర్మించగా విజయవంతమైనట్టు తెలిపారు. కరీంనగర్ మార్గంలో హైదరాబాద్ నుంచి శామీర్‌పేట వరకు 18.5 కిలోమీటర్ల డబుల్ డెకర్ సైవే నిర్మిస్తే ఐదు జిల్లాల ప్రజలకు హైదరాబాద్ రాకపోకలు సాఫీగా సాగుతాయని చెప్పారు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నాటి రక్షణశాఖ మంత్రిని కలిసి విన్నవించినట్టు గుర్తుచేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పన్నాల భూపతిరెడ్డి, గవ్వా వంశీధర్‌రెడ్డి, బక్క నాగరాజు, ఉపేంద్ర, మహ్మద్ ఫయాజ్ పాల్గొన్నారు.