జగిత్యాల టౌన్, అక్టోబర్ 20: ‘కాళేశ్వరం ప్రాజెక్టును రూ.97 వేల కోట్లతో నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు తెస్తే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 30 కిలోమీటర్ల ముత్యమంత మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తానంటున్నాడు.. ఇదేం లెక్క?’ అని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన జగిత్యాలలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచారని దుయ్యబట్టారు.
తాము తెలంగాణను దేశంలోనే అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తే, ఏ విధంగా అప్పుల్లో కూరుకుపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క పరిపాలన చేతకాక.. రోజుకు రూ.200 కోట్ల అప్పు కడుతున్నామని రాష్ర్టాన్ని అభాసుపాలు చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల జీడీపీతో పోల్చి చూస్తే మన అప్పులు చాలా తక్కువ అని, ఇవి తన లెక్కలు కాదని మోదీ ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతున్నదని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే డిసెంబర్ 4 నాటికి కాంగ్రెస్ గద్దెనెక్కి ఏడాది పూర్తవుతుందని, గులాబీ జెండా శ్రేణులతో కలిసి తాము ఇల్లిల్లూ తిరిగి కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేసిన మోసాల గురించి వివరిస్తామని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌కుమార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, మల్యాల మాజీ జెడ్పీటీసీ రాంమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.