హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): దేశంలో కార్మికుల హక్కులు మంటగలుస్తున్నాయని, వారి హక్కులను యాజమాన్యాలు కాలరాస్తున్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్మిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో నడుస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. శ్రామికులంతా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం కొత్తగా తెచ్చిన 4 కార్మిక చట్టాల గురించి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. గతంలో కార్మికులకు అనేక వెసులుబాట్లు ఉండేవని, ఇప్పుడు పెట్టుబడిదారులు అలాంటి వెసులుబాట్లేమీ లేకుండా చేసి, శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ విధమైన దోపిడీ ఉన్నంత వరకు కార్మిక సంఘాలు పోరాడుతూనే ఉంటాయని వినోద్‌కుమార్ పేర్కొన్నారు.