హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్మిక చట్టాల్లో తీసుకొస్తున్న మార్పులు.. కార్మికులకు గొడ్డలి పెట్టులా మారనున్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. కార్మిక చట్టాల మార్పులకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతునిస్తుందని ప్రకటించారు. కార్మికులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరంతరం అండగా ఉంటారని తెలిపారు. తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడారు.
దేశభక్తి పేరుతో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నదని, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు తప్ప.. కార్మికుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రాన్ని మించి, కార్మిక, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కార్మికులకు, ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఆశా వర్కర్లు, ఇతర అన్నివర్గాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్, నాయకులు బీ నారాయణ, వీ మారయ్య, సిలివేరు ప్రభాకర్, శివశంకర్, మచ్చా నరసింహులు, నాగేశ్ యాదవ్, హమాలీ శీను, ఆర్ సంతోష్, నిర్మలారెడ్డి, దాసకచర్ల చారి, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.