హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ధరణి చట్టం -2020 రద్దు చేయాల్సిన అవసరంలేదని, సవరణలు చేస్తే సరిపోతుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రభుత్వానికి శనివారం లేఖ రాశారు. తెలంగాణ రికార్డ్స్ రైట్స్ బిల్లు 2024 కు సూచనలు చేయమని ప్రజలు, న్యాయవాదులు, రెవెన్యూ, రిటైర్డ్ అధికారులను కోరారని చెప్పారు. రెవెన్యూ చట్టాల గురించి తోటి న్యాయవాదులతో కూలంకషంగా చర్చించానని తెలిపారు.
సబ్ సెక్షన్ చేర్చాలి
సెక్షన్-1కు అదనంగా మరొక సబ్సెక్షన్ను ఏర్పాటుచేయాలని సూచించారు. గత ప్రభుత్వం కూడా ధరణి చట్టం వచ్చాక మార్పులు చేయాలని అభిప్రాయపడిందని గుర్తు చేశారు. ఎన్నికలు రావడంతో చేయలేకపోయారని తెలిపారు. గత ప్రభుత్వ చట్టంలో తప్పు చేసిన అధికారిపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉన్నదని చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో యాజమానికి ఎకడ భూమి ఉన్నా ఒకటే నంబర్ చెప్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో యాంబిగ్విటీ (సందిగ్ధత, అస్పష్టత) పదాన్ని కొత్త చట్టం నుంచి తొలగించాలని కోరారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్) ఇచ్చారని తెలిపారు. ఆర్వోఆర్ చట్టంలోని 20 సెక్షన్లను లోతుగా అధ్యయనం చేసి తమ అభిప్రాయం చెప్పామని తెలిపారు.