హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : విభజన చట్టం షెడ్యూల్ 13లో పేర్కొన్నట్టుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్‌చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం ఏపీలో భారత్ పెట్రోలియం ఆధ్వర్యంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ హబ్‌ను రూ.60 వేల కోట్లతో ఏర్పాటు చేయనుందని చెప్పారు.
చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని, కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. విభజన చట్టంలో ఉన్న ఆయిల్ రిఫైనరీని పదేండ్ల తర్వాత ఏర్పాటు చేస్తున్నారని గుర్తుచేశారు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో బీజేపీకి సొంతంగా సీట్లు వస్తే ఆ రాష్ర్టానికి ఏమీ ఇవ్వకపోవునని, ఇప్పుడు బీజేపీ సర్కారు టీడీపీపై ఆధారపడి ఉన్నది కాబట్టి మోదీకి విభజనచట్టంలోని అంశాలు గుర్తుకు వస్తున్నాయని, అక్కడ ప్రాంతీయ పార్టీ గెలిచింది కాబట్టే చంద్రబాబు అడిగినవి మోదీ ఇస్తున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాంతీయ పార్టీకి ఓటేసి మంచి పని చేశారని పేర్కొన్నారు. 30 ఏండ్లుగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటం కొనసాగుతున్నదని, పదేండ్లలో బీఆర్ఎస్ ఎంపీలు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు అడిగినా తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని గుర్తుచేశారు.
తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నారని, కేంద్ర క్యాబినెట్ మంత్రి, సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, విభజన చట్టంలోని ఆంశాలపై వారు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 8 మంది ఎంపీలను గెలిపించినా తెలంగాణ ప్రజలకు బీజేపీ మొండి చేయి చూపిస్తున్నదని విమర్శించారు . బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజకీయాల గురించి తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఒక చర్చ కూడా జరగలేదని, విభజన హామీల గురించి ఒక్క మాటా మాట్లాడలేదని దుయ్యబట్టారు.
కేసీఆర్ కొత్త తరాన్ని తీసుకొస్తారు..
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, మళ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి అధికారంలోకి వస్తుందని వినోద్‌కుమార్ ధీమా వ్యక్తంచేశారు. నాడు అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరామని చెప్పినవాళ్లంతా మళ్లీ అభివృద్ధి కోసమేనంటూ కాంగ్రెస్‌లో చేరారని అలాంటి వాళ్లు పార్టీ మారితే నష్టమేం లేదని స్పష్టంచేశారు.
పార్టీలు మారే వారిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, వాళ్లు మళ్లీ బీఆర్ఎస్లోకి వస్తామన్నా రానివ్వని చెప్పారు. కేసీఆర్ కొత్త తరాన్ని తీసుకొస్తారని, బీఆర్ఎస్ను ప్రజలు ఆదరిస్తారని, త్వరలోనే పార్టీ సమావేశాలు పెట్టుకుంటామని తెలిపారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు కల్యాణ్‌రావు పాల్గొన్నారు.