సూర్యాపేట, మే 30: మూడో డిస్కమ్ ఏర్పాటు తెలంగాణ రైతాంగం పాలిట ఉరితాడుగా మారనున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. మూడో డిస్కమ్ తీసుకొస్తామని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు రైతుల మోటర్లకు మీటర్లు పెట్టక తప్పదనడం దారుణమని అన్నారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో 24గంటలు రైతులకు ఉచిత విద్యుత్తు అందజేశారని.. నాడు రైతుల మోటర్లకు మీటర్లు పెడితే 30వేల కోట్ల సబ్సిడీ ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ మాటలకు కేసీఆర్ లొంగలేదని స్పష్టంచేశారు.
‘నా మెడ మీద తలకాయ ఉన్నంత వరకు రైతుల మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని కేసీఆర్ మీటర్లను తిరస్కరించారని’ అన్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదంరెడ్డి రైతులకు 24గంటల కరెంట్ అవసరం లేదని, మూడు గంటలిస్తే సరిపోతుందనడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న రెండు డిస్కమ్‌లకు 54 వేల కోట్ల రుణాలు ఉన్నాయని, అవే కష్టంగా నడుస్తున్నాయని, అది చాలదన్నట్టుగా మూడో డిస్కమ్ ఏర్పాటు అంటే ఉచిత విద్యుత్తును రద్దు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని మండిపడ్డారు.