మక్తల్, డిసెంబర్ 2 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఏం సాధించారని మక్తల్లో విజయోత్సవ సభ జరుపుకొన్నారని మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రశ్నించా రు. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్లో చిట్టెం స్వగృహంలో వారు మీడియాతో మాట్లాడారు. మక్తల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ సభ ప్రజలు లేక తుస్సుమన్నదని ఎద్దేవాచేశారు. కేసీఆర్ హయాంలో 85శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును జీవో 69 పేరిట తెరమీదికి తీసుకొచ్చారని ఆరోపించారు. పాజెక్టు నిర్మాణం కోసం మొదటగా రూ.1,600 కోట్లు అని, ప్రస్తుతం రూ. 5,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పడంతో ప్రాజెక్టు నుంచి ఎంతవరకు దోచుకోవాలనే ఆలోచన తప్ప ఇంకేమీలేదని తెలుస్తున్నదని చెప్పారు.