మహబూబ్‌గర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):హైదరాబాద్-బెంగళూర్ 44వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నుంచి రాష్ట్రంలోని ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే రూ.8 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వకుంటే పనులు నిలిపివేస్తామని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగినట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఆ మాజీ ఎమ్మెల్యేపై సదరు కాంట్రాక్టర్ జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫిర్యాదును పరిశీలించి కేసు నమోదు చేయాలని ఎస్పీ అలంపూర్ పో లీసులకు సూచించినట్టు పోలీసువర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై జాతీయ రహదారుల శాఖ (ఎన్హెచ్ఏఐ) కూడా తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. కాగా మాజీ ఎమ్మెల్యే బెదిరింపుల వ్యవహారాన్ని పోలీసుశాఖ రహస్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తున్నది. కాంట్రాక్టర్ ఫిర్యాదు ఇచ్చినట్టు చెప్తున్నా.. ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని పోలీసులు బుకాయిస్తున్నారు.
అవాక్కయిన జాతీయ రహదారుల శాఖ
జోగుళాంబ గద్వాల జిల్లాలో 44వ జాతీయ రహదారిపై బీచుపల్లి నుంచి అలంపూర్ చౌరస్తా వరకు రహదారి విస్తరణ పను లు జరుగుతున్నాయి. ప్రస్తుతమున్న నాలుగు లేన్లను ఆరు లేన్లుగా మారుస్తున్నారు. ఈ పనులను భ్రమర ఇన్ఫ్రా దక్కించుకున్నది. ఆ సంస్థ ఇటీవలే పనులు ప్రారంభించింది. తనను కలవకుండా పనులు ప్రారంభిస్తారా? అని అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మండిపడినట్టు తెలిసింది. తనకు రూ.8 కోట్లు ఇవ్వాలని లేకపోతే పనులు ఎలా చేస్తావో చూస్తామని బెదిరించినట్టు సమాచారం. దీంతో సదరు కాంట్రాక్ట్ సంస్థ అధిపతి జగదీశ్‌ప్రసాద్ గద్వాల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరపాలని.. కేసు నమోదు చేయాలని అనుకున్నప్పటికీ కొందరు అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఫిర్యాదు కాపీని దాచేసినట్టు తెలిసింది. ఇలా అయితే పనులు ఎలా చేస్తామని వాపోతున్నారు. జాతీయ రహదారి విస్తరణతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోవడం, కేంద్రం నిధులతో పనులు జరుగుతుండటంతో వారంతా కాంట్రాక్టర్‌కు మద్దతు పలుకుతున్నారు. దీంతో ఆయన ధైర్యంగా జిల్లా పోలీసులను సంప్రదించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ ఫిర్యాదుపై పోలీసు యంత్రాంగం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.
జిల్లాలో అన్నీ అతడే
కాంట్రాక్టర్‌ను బెదిరించిన సదరు మాజీ ఎమ్మెల్యే జిల్లాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో తాను ఓటమి పాలైనా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో నియోజకవర్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఏఐసీసీలో కూడా కీలక పోస్టులో ఉన్నారు. నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులు మొదలుకొని పంచాయతీ కార్యదర్శి ఎవరు ఉండాలో కూడా ఆయనే డిసైడ్ చేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయిస్తున్నారు. నియోజకవర్గంలోని జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోవాలనుకున్న మంత్రులు సైతం ఇతని పర్మిషన్ లేనిది రాకూడదని హుకుం జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో సీఎం ఎక్కడ పర్యటించినా.. అక్కడ ఈ మాజీ ఎమ్మెల్యే ప్రత్యక్షమవుతారు.
ఇసుక దందా వెనుక ఆయనే!
అలంపూర్ నియోజకవర్గంలో తుంగభద్ర నదీ తీరం నుంచి సదరు మాజీ ఎమ్మెల్యే అండదండలతో ప్రతిరోజూ ఇసుక అక్రమ రవాణా సరిహద్దులు దాటుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో టిప్పర్‌కు నెలకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్నట్టు, ఈ వసూళ్లన్నీ పోలీస్ యంత్రాంగమే దగ్గర ఉండి చేపడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు సహకరించని కొందరు ఎస్సైలను బదిలీ చేయించినట్టు సమాచారం. రాజోళి, అలంపూర్, వడ్డేపల్లి, అయిజ ప్రాంతాల్లో జోరుగా ఇసుక రవాణా కొనసాగుతున్నది. ఇసుక అక్రమ వ్యవహారం తెలిసినా కూడా మైనింగ్, రెవెన్యూ, పోలీస్‌శాఖ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎవరైనా రైతులు అడ్డుకుంటే ఉల్టా వారిపైనే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు. పీసీసీ కూడా ఈ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంపై మౌనంగా ఉండడంపై పార్టీలో కొందరు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు.
మాకు ఏ ఫిర్యాదూ అందలేదు : ఎస్పీ
రూ.8 కోట్లు డిమాండ్ చేసిన విషయంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. కాంట్రాక్టర్ ఫిర్యాదుపై ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి జిల్లా ఎస్పీని వివరణ కోరగా ఆయన స్పందిస్తూ ‘నేను సెలవులో ఉన్నాను.. నాకు ఎలాంటి సమాచారం లేదు. ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదు’ అని చెప్పుకొచ్చారు.