స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 26 : పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని ఆర్థికంగా దివాళా తీయిస్తూ అన్నివర్గాలను ఇబ్బందులకు గురిచేస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడంలేదని విమర్శించారు. బీఆర్ఎస్ రజతోత్సవాల నేపథ్యంలో ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద పార్టీ అధినేత కేసీఆర్ చిత్రపటానికి గులాబీ శ్రేణులతో కలిసి పుష్పాభిషేకం చేశారు. అనంతరం బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట సురేందర్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో రాజయ్య మాట్లాడారు. రజతోత్సవాల సందర్భంగా కేసీఆర్ సూచనల మేరకు ఉద్యమకారులు, తెలంగాణవాదులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు మరింత చైతన్యంతో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ పునఃనిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పేదలకు సంక్షేమ పథకాలకు అందేవరకూ బీఆర్ఎస్ శ్రేణులు పోరాడాలని పిలుపునిచ్చారు.