చొప్పదండి, ఏప్రిల్ 28 : ధాన్యం కొనుగోలులో నూతన విధానాన్ని తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెడుతున్న పీఎం మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి రైతు ద్రోహులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కొనుగోలు కేంద్రాలకు కొబ్బరికాయలు కొట్టుడు కాదని, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని తెలంగాణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, బత్తిని సంపత్ ఆధ్వర్యంలో.. ఆంక్షలు లేకుండా ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. రైతులు 25 రోజుల క్రితం కల్లాల్లో పోసిన ధాన్యాన్ని కాంగ్రెస్ సర్కార్ కొనడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ రైతులను వెన్నుపోటు పొడుస్తున్నదని, 25 రోజులుగా ధాన్యం కొనకుండా కొర్రీలు పెడుతున్నదని మండిపడ్డారు. కొత్తగా జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చిందని, జీపీఎస్ ఆన్లైన్ చేసుకుని, ట్రక్‌షీట్ ఉంటేనే వాహనం వస్తుందని, ట్రక్ షీట్ విధానం ద్వారా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించిన కేసీఆర్ రైతు బాంధవుడు అయ్యాడని కొనియాడారు. రెండు రోజుల్లో పాత పద్ధతిలో కొనుగోలు చేపట్టకపోతే చొప్పదండి నియోజకవర రైతులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు, రైతులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.