Congress Govt | గంగాధర, జనవరి 5: రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని నమ్మించి మోసం చేయడంపై కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన ధర్నాపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బలవంతంగా అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. హోటల్లో కూర్చొని టీ తాగుతున్న బీఆర్ఎస్ నాయకులను సైతం వదలకుండా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రైతుల తరపున పోరాటం చేయడమే తాము చేసిన నేరమా అని బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమకు కేసులు, జైలు కొత్తకాదని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రైతుల పక్షాన మరో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నాయకులను సాయంత్రం వరకు ఠాణాలో నిర్బంధించి సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు.
సుంకె హౌస్ అరెస్ట్
గంగాధర మండలం మధురానగర్‌లోని ధర్నాకు బయలుదేరుతున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను బూరుగుపల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతుల తరపున ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేయడానికి వెళ్తున్న తనను నిర్బంధించడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తున్నదా? నిర్బంధ ప్రభుత్వం నడుస్తున్నదా? అని ప్రశ్నించారు.
తప్పుడు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏం సాధించారని కాంగ్రెస్ నాయకులు సంబురాలు, క్షీరాభిషేకాలు చేస్తున్నారని నిలదీశారు. ఇచ్చిన హామీలను తప్పినందుకా? రైతు భరోసా ఇవ్వనందుకా? రుణమాఫీని పూర్తిగా అమలు చేయనందుకా? కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వనందుకా? కాంగ్రెస్ నాయకులు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. హామీలను అమలు చేయని రేవంత్‌రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.